దుబాయ్ : ఎంఎస్ ధోనిని ఒక విజయవంతమైన కెప్టెన్‌గానే చూశాం. అతను ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. సహజంగా ధోని మ్యాచ్‌లో ఐదుగురితో బౌలింగ్ చేయించడానికి ఇష్టపడడు. ఇన్నింగ్స్‌లు బ్రేక్ చేయడానికి మధ్యలో ఒకటి రెండు ఓవర్లు పార్ట్ టైం బౌలర్లతో వేయిస్తుంటాడు. అది అంతర్జాతీయ మ్యాచ్‌లు కావొచ్చు.. ఐపీఎల్ కావొచ్చు. ఐపీఎల్ విషయంలో గతంలో ధోని రైనా, వాట్సన్ లాంటి వారితో ఒకటి.. రెండు ఓవర్లు వేయించాడు. కానీ ఐపీఎల్ 13వ సీజన్‌లో మాత్రం ధోని ఐదుగురు బౌలర్లతోనే పూర్తి ఓవర్లు వేయిస్తున్నాడు. దానికి ధోని దగ్గర ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్ చోప్రా అంటున్నాడు. ఢిల్లీతో మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై జట్టు ఆటతీరుతో పాటు ధోని గురించి ఆకాశ్ చోప్రా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'నాకు తెలిసి ధోని ఇలా చేయడం ఇదే తొలిసారి అనుకుంటా.. ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న ధోని కేవలం ఐదుగురు బౌలర్లతోనే పూర్తి ఓవర్లు వేయించడం. సహజంగా ధోని ఐదుగురితో బౌలింగ్‌కు ఇష్టపడడు.. కానీ ఈసారి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వారితోనే పూర్తి కోటా కానిచ్చేస్తున్నాడు. దీనికి కారణాలు లేకపోలేదు.. టాపార్డర్‌లో రాయుడు లాంటి ఆటగాడు మిస్ అవడం.. రాయుడు స్థానంలో వచ్చిన రుతురాజ్ అంతగా ఆకట్టుకోలేకపోవడం.. మరో ఓపెనర్ విజయ్ మురళి పరుగులు చేయకపోవడంతో అదనపు బ్యాట్స్‌మన్ కోసం ధోని ఆరుగురితోబౌలింగ్ చేయించలేకపోతున్నాడు. (చదవండి : రైనా, రాయుడు లోటు స్పష్టంగా తెలుస్తుంది)
'గతంలో వాట్సన్‌ను లేదా కేదార్ జాదవ్‌తో పార్ట్ టైం బౌలింగ్ చేయించే ధోని ఈసారి మాత్రం దానికి మొగ్గు చూపడం లేదు. ఈ సీజన్‌లో రవీంద్ర జడేజా కూడా బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోతున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో చూసుకుంటే 40కి పైగా పరుగులు ఇచ్చాడు. అంతేకాదు చావ్లా, జడేజా స్పిన్ ద్వయం.. రాజస్తాన్‌తో మ్యచ్‌లో 8 ఓవర్లు కలిపి 95 పరుగులు, ఢిల్లీతో మ్యాచ్‌లో 8 ఓవర్లు కలిపి 77 పరుగులు ఇచ్చాడు. అయినా ధోని మాత్రం పార్ట్‌టైం బౌలర్లను వినియోగించడానికి ఇష్టపడడం లేదు. బహుశా టాపార్డర్ మీద పూర్తిగా నమ్మకం లేకపోవడం.. మిడిల్ ఆర్డర్‌లో మరో అదనపు బ్యాట్స్‌మన్ కోసం ధోని వారిపై బౌలింగ్ ద్వారా ఒత్తిడి పడకూడదని అనుకొని ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు.
'ఇక ధోని లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు ఎందుకు వస్తున్నాడో తాను అర్థం చేసుకోగలను. ఉదాహరణకు ఢిల్లీతో మ్యాచ్ తీసుకుంటే.. 176 పరుగులు చేధించడం సీఎస్‌కేకు పెద్ద కష్టమేమి కాదు. కానీ ఓపెనర్లు వాట్సన్, మురళి విజయ్‌లు పవర్‌ప్లేలో బారీ షాట్లు ఆడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అయినా చెన్నై జట్టులో మూడు, నాలుగు, ఐదు స్థానాలు ఖాళీగా లేవు. ఎందుకంటే ఆ స్థానాల్లో వరుసగా డుప్లెసిస్, రుతురాజ్, కేదార్ జాదవ్‌లు వస్తున్నారు. కేదార్ జాదవ్‌ను అదనపు బ్యాట్స్‌మన్ కోటాలో జట్టులోకి తీసుకోవడంతో ధోని కన్నా ముందు రావడమే సరైనది. అయితే రాయుడు స్థానంలో రుతురాజ్ రాణించాలి.. కానీ ఒత్తిడికి తలొగ్గి ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. (చదవండి : ధోని విషయంలో ప్రతీసారి ఈ ప్రశ్న వస్తుంది)
డుప్లెసిస్ మంచి ప్రదర్శన కనబరుస్తున్న.. అతనికి సహకారం అందించేవారు కరువయ్యారు. వాట్సన్ గురించి చర్చ అనవసరం.. ఫాంలోకి వస్తే జట్టుకు తిరుగుండదు.. కానీ మురళీ విజయ్.. రుతురాజ్‌లు ఇలా ఆడుతుండడం కాస్త ఇబ్బందే. రైనా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.. అతని స్థానంలో సరైన ఆటగాడు ఇంతవరకు చెన్నైకి తగల్లేదు. హర్భజన్ జట్టులో ఉండి ఉంటే కాస్త ధైర్యం ఉండేది.. ఒక జట్టుగా చెన్నె ఇబ్బందుల్లో ఉంది.. అందుకే 150-160 పరుగులను చేధించగలదు.. పెద్ద లక్ష్యాలు కాస్త కష్టంగా మారింది. ఇప్పటికైనా ధోని 6గురు బౌలర్లను ప్రయోగిస్తే బాగుంటుంది.'అంటూ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment