సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. యూఏఈ వేదికగా వచ్చే నెల 19వ తేదీ నుంచి ఐపీఎల్ ఆరంభం కానున్న నేపథ్యంలో అన్ని జట్లు తమ ప్రణాళికల్లో నిమగ్నమై పోయాయి. కాగా, విరాట్ కోహ్లి సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరపున ఆడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ తెలిపాడు. తొలిసారి ఆర్సీబీకి ఆడుతున్న ఆనందంలో ఉన్న ఫించ్.. ఆ జట్టులోని గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడటాన్ని ఆస్వాదిస్తానన్నాడు. (‘ఫ్యాబ్-4 బ్యాటింగ్ లిస్టులోకి వచ్చేశాడు’)
ఏఎన్‌ఐతో ఫించ్ మాట్లాడుతూ.. ‘ ఆర్సీబీతో కలవడానికి నిరీక్షిస్తున్నా. ఇప్పటికే ఆర్సీబీతో జాయిన్ కావడం ఆలస్యమైంది. వరల్డ్‌లోని పలువురు అత్యుత్తమ ఆటగాళ్లు ఆర్సీబీలో ఉన్నారు. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల మధ్య ఆడితే ఇంకా మజాగా ఉండేది.. కానీ ఆ అవకాశం లేదు. యూఏఈలో ఐపీఎల్ జరుగుతుంది. కోహ్లి నాయకత్వంలో ఆడటం ఇదే తొలిసారి. దాంతో ఆతృత ఎక్కువైంది. చాలాకాల నుంచి కోహ్లి-నేను ప్రత్యర్థులుగా తలపడుతున్నాం. ఈసారి కలిసి ఆడబోతున్నాం. దాంతో కోహ్లితో కలిసి ఆడటం కోసం ఎదురుచూస్తున్నా’ అని ఫించ్ తెలిపాడు. ఇక మీ నాయకత్వం కోహ్లికి ఏమైనా ఉపయోగపడుతుందా అనే దానికి ఫించ్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ‘నా అనుభవం ఆర్సీబీకి ఉపయోగపడుతుందనే ఆశిస్తున్నా. మా జట్టులో ఎవరికైనా సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటా. ఇక కోహ్లికి ఒత్తిడి తగ్గించడానికి చేయాల్సినదంతా చేస్తా’ అని ఫించ్ చెప్పుకొచ్చాడు. గతంలో పలు ఫ్రాంచైజీలకు ఐపీఎల్‌లో ఫించ్ ప్రాతినిథ‍్యం వహించగా, ఈ సీజన్ ఐపీఎల్‌గాను గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది.(‘ధోని ఏమిటో మీరే చూస్తారు కదా’)
Comments
Please login to add a commentAdd a comment