అభిషేక్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ ఊచకోత.. విధ్వంసకర శతకాలతో రికార్డు | Abhishek Sharma 60-Ball Century, Prabhsimran's Ton 2nd Highest 1st Wicket Partnership In VHT | Sakshi
Sakshi News home page

అభిషేక్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ ఊచకోత.. విధ్వంసకర శతకాలతో రికార్డు

Published Tue, Dec 31 2024 12:04 PM | Last Updated on Tue, Dec 31 2024 1:18 PM

Abhishek Sharma 60-Ball Century, Prabhsimran's Ton 2nd Highest 1st Wicket Partnership In VHT

టీమిండియా జెర్సీల్లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌- అభిషేక్‌ శర్మ(ఫైల్‌ ఫొటో)

టీమిండియా యువ ఓపెనర్‌, పంజాబ్‌ కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ(Abhishek Sharma) విధ్వంసకర శతకంతో మెరిశాడు. సౌరాష్ట్ర బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అభిషేక్‌తో పాటు మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(Prabhsimran Singh) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగి.. శతక్కొట్టాడు. 

ఈ క్రమంలో అభిషేక్‌- ప్రభ్‌సిమ్రన్‌ జోడీ విజయ్‌ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25- వీహెచ్‌టీ)లో సరికొత్త రికార్డు సాధించింది.కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ వీహెచ్‌టీలో భాగంగా పంజాబ్‌ మంగళవారం నాటి మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టుతో తలపడుతోంది. 

అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ అదిరిపోయే ఆరంభం అందించారు.

అరవై బంతుల్లోనే
అభిషేక్‌ శర్మ అరవై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 96 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 170 పరుగులు సాధించాడు. మరో ఎండ్‌ నుంచి అభిషేక్‌కు సహకారం అందించిన ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌.. 95 బంతుల్లో 125 పరుగులతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం విశేషం.

అరుదైన రికార్డు
ఈ క్రమంలో అభిషేక్‌ శర్మ- ప్రభ్‌సిమ్రన్‌ కలిసి తొలి వికెట్‌కు 298 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా విజయ్‌ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక పరుగులు(highest first-wicket partnership) జోడించిన రెండో జంటగా నిలిచారు. బెంగాల్‌ బ్యాటర్లు సుదీప్‌ ఘరామి- అభిమన్యు ఈశ్వరన్‌ 2022లో సాధించిన రికార్డును సమం చేశారు.

వీరిది మాత్రం ప్రపంచ రికార్డు
ఇక ఈ టోర్నీలో తొలి వికెట్‌కు అత్యధికంగా 416 పరుగులు జతచేసిన జోడీ తమిళనాడు స్టార్లు నారాయణ్‌ జగదీశన్‌, బి. సాయి సుదర్శన్‌ టాప్‌లో కొనసాగుతున్నారు. కేవలం విజయ్‌ హజారే ట్రోఫీలోనే కాకుండా లిస్ట్‌- ‘ఎ’ క్రికెట్‌లో హయ్యస్ట్‌ పార్ట్‌నర్‌షిప్‌ సాధించిన జంటగా వీరు ప్రపంచ రికార్డు కూడా సాధించారు.

300 పైచిలుకు స్కోరు
ఇదిలా ఉంటే..ప్రణవ్‌ కరియా బౌలింగ్‌లో జే గోహిల్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక మరోసారి ప్రణవ్‌ కరియా తన స్పిన్‌ మాయాజాలం ప్రదర్శించగా.. రుచిత్‌ అహిర్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక అభిషేక్‌- ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ ఊచకోత కారణంగా పంజాబ్‌ కేవలం 34 ఓవర్లలోనే 300 పరుగుల మార్కు దాటింది.

వరుస విజయాలకు కర్ణాటక బ్రేక్‌
కాగా విజయ్‌ హజారే ట్రోఫీ 2024-25 సీజన్‌లో పంజాబ్‌ తొలి మ్యాచ్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. తదుపరి నాగాలాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అనంతరం కర్ణాటకతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్‌ తేడాతో ఓటమిపాలైంది. 

ఆ తర్వాత ముంబైని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి మళ్లీ విజయాల బాట పట్టింది. తాజాగా సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ గెలుపొంది గ్రూప్‌-‘సి’లో మరింత పటిష్ట స్థితికి చేరాలని పట్టుదలగా ఉంది.

చదవండి: టెస్టులకు రోహిత్‌ శర్మ గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement