విధ్వంసకర శతకం.. రెండో స్థానానికి దూసుకొచ్చిన అభిషేక్‌ శర్మ | ABHISHEK SHARMA MOVES TO NUMBER 2 IN ICC T20I BATTING RANKINGS | Sakshi
Sakshi News home page

విధ్వంసకర శతకం.. రెండో స్థానానికి దూసుకొచ్చిన అభిషేక్‌ శర్మ

Published Wed, Feb 5 2025 2:49 PM | Last Updated on Wed, Feb 5 2025 3:10 PM

ABHISHEK SHARMA MOVES TO NUMBER 2 IN ICC T20I BATTING RANKINGS

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో (ICC T20 Rankings) టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) దుమ్మురేపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20లో విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడిన శర్మ.. ఒక్కసారిగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. 

ప్రస్తుతం శర్మ కెరీర్‌లో అత్యుత్తమంగా 829 రేటింగ్‌ పాయింట్లు సాధించాడు. శర్మ దెబ్బకు సహచరుడు తిలక్‌ వర్మ మూడో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి దిగజారాడు. ఆసీస్‌ విధ్వంసకర వీరుడు ట్రవిస్‌ హెడ్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అభిషేక్‌ శర్మ దెబ్బ​కు టాప్‌-10 (హెడ్‌ మినహా) బ్యాటర్లు తలో స్థానం కోల్పోయారు. 

ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు టీ20ల్లో సత్తా చాటిన శివమ్‌ దూబే 38 స్థానాలు ఎగబాకి 58వ  స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పర్వాలేదనిపించిన హార్దిక్‌ పాండ్యా 5 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ స్థానానికి చేరాడు. బ్యాటింగ్‌ విభాగంలో భారత్‌ తరఫున ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.

బౌలింగ్‌ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో చివరి టీ20లో రెండు వికెట్లతో సత్తా చాటిన వరుణ్‌ చక్రవర్తి మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆదిల్‌ రషీద్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. భారత్‌ తరఫున టాప్-5లో ఉన్న ఏకైక బౌలర్‌ వరుణ్‌ ఒక్కడే. తాజా ర్యాంకింగ్స్‌లో విండీస్‌ స్పిన్నర్‌ అకీల్‌ హొసేన్‌ తిరిగి అగ్రస్థానాన్ని చేజిక్కించుకోగా.. హసరంగ, ఆడమ్‌ జంపా తలో స్థానం దిగజారి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 

ఇంగ్లండ్‌తో చివరి టీ20లో ఓ మోస్తరుగా రాణించిన భారత స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరాడు. టీ20ల్లో భారత లీడింగ్‌ వికెట్‌ టేకర్‌ అర్షదీప్‌ 8 నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. ఇవి మినహా బౌలర్ల విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. 

ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా మాజీ వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. జట్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఏ జట్టుకు అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. 19561 పాయింట్లతో టీమిండియా టాప్‌లో కొనసాగుతుంది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 12417 పాయింట్లు మాత్రమే కలిగి ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement