అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్‌ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా.. కనీసం టాస్ పడకుండానే ముగిసిపోయింది. కాగా 2017లో టెస్టు హోదా సంపాదించిన అఫ్గన్ జట్టు.. తటస్థ వేదికలపై తమ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో తొలిసారిగా టెస్టు ఆడేందుకు వేదికగా భారత్‌ను ఎంచుకుంది.
సోమవారమే మొదలు కావాలి.. కానీ
భారత క్రికెట్ నియంత్రణ మండలిని సంప్రదించి తమ రాజధాని కాబూల్‌కు దగ్గరగా ఉన్న గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియానికి విచ్చేసింది. ఇందులో భాగంగా.. షెడ్యూల్ ప్రకారం అఫ్గన్- కివీస్ జట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ మొదలుకావాలి.. కానీ రెండు రోజుల పాటు ఆటగాళ్లు మైదానంలో దిగే పరిస్థితి లేకపోయింది. ఆట ముందుకు సాగడమే గగనమైంది.
తొలి రెండు రోజులు వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆటకు సిద్ధం కాలేదు. గత రెండు వారాల క్రితం నోయిడాలో కురిసిన భారీ వర్షాల కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం తడిగా మారింది. నీరు బయటకు వెళ్లేందుకు గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి
అదే విధంగా... మైదానాన్ని ఆటకు వీలుగా ఆరబెట్టే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి తలెత్తింది. కేవలం నోయిడా స్టేడియంలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే అఫ్గనిస్తాన్ జట్టుకు భంగపాటు ఎదురవుతోంది. రెండోరోజు ఆట జరిపించేందుకు మంగళవారం మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది.
ల్యాండ్‌స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చినా అవుట్‌ఫీల్డ్ పొడిబారలేదు. ఫ్యాన్‌లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేసినా ఫలితం శూన్యం. దీంతో కనీసం మూడో రోజైనా పరిస్థితి మెరుగపడుతుందని అఫ్గన్- న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు, అభిమానులు ఎదురుచూశారు.
ఇప్పుడిక వర్షం
అయితే, ఈరోజు వర్షం కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. వాన కురుస్తున్న కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం కవర్లతో కప్పేశారు గ్రౌండ్స్‌మెన్. దీంతో మూడో రోజు కూడా ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక మరో రెండు రోజుల పాటూ నోయిడాలో భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అఫ్గన్- కివీస్ టెస్టు మొదలుకాకుండానే ముగిసిపోయే దుస్థితి నెలకొంది.
చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్!
Comments
Please login to add a commentAdd a comment