న్యూజిలాండ్‌తో తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన అఫ్గనిస్తాన్ జట్టుకు వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో సరైన వసతిలేని కారణంగా రెండో రోజు ఆట కూడా రద్దైపోయింది. ఒక్క బంతి కూడా పడకుండానే మంగళవారం నాటి ఆట ముగిసిపోయింది. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తితో స్టేడియం నుంచి నిష్క్రమించినట్లు సమాచారం.
కారణం ఇదే
కాగా స్వదేశంలో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితిలేని కారణంగా అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తటస్థ వేదికలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలో తొలిసారిగా కివీస్‌తో టెస్టు ఆడేందుకు భారత్‌లోని గ్రేటర్ నోయిడా మైదానాన్ని ఎంచుకుంది. ఇందుకు సంబంధించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి కూడా ఆమోదం రావడంతో అఫ్గన్ జట్టు నోయిడాకు చేరుకుంది.
ఇక షెడ్యూల్ ప్రకారం సోమవారమే(సెప్టెంబరు 9) అఫ్గన్- కివీస్ ఏకైక టెస్టు ఆరంభం కావాల్సి ఉంది. అయితే, గత రెండు వారాలుగా కురిసిన భారీ వానల కారణంగా నోయిడా స్టేడియం అవుట్ ఫీల్డ్ మొత్తం తడిసిపోయింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గ్రౌండ్స్‌మెన్ ఎంతగా కష్టపడినా ఫలితం లేకపోయింది.
ఈ స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి మళ్లీ ఎండకాస్తే తప్ప గ్రౌండ్ ఆరే పరిస్థితి లేదు. అయితే, రెండురోజులుగా నోయిడాలో వర్షం లేకపోయినా.. వాతావరణం మాత్రం పొడిగా లేదు. అయినప్పటికీ సూపర్ ఫ్యాన్లతో ఆరబెట్టేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఈ క్రమంలో నిన్నటితో పోలిస్తే కాస్త పరిస్థితి మెరుగైనా ఆట మొదలుపెట్టేందుకు అనుకూలంగా లేకపోయింది.
రెండో రోజు కూడా టాస్ పడకుండానే
ఈ నేపథ్యంలో టాస్ పడకుండానే అఫ్గన్- న్యూజిలాండ్ తొలిరోజు ఆట ముగిసిపోయింది. దీంతో రెండో రోజు నుంచి అరగంట ఎక్కువసేపు మ్యాచ్ నిర్వహిస్తామని అంపైర్లు తెలిపారు. అయితే, ఈ రోజు(మంగళవారం) కూడా అదే పరిస్థితి ఎదురైంది. అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆడే పరిస్థితి లేదని అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ అధికారులు, ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.
కివీస్‌కు నష్టమేమీ లేదు.. కానీ
నోయిడా స్టేడియం మేనేజ్‌మెంట్ వల్ల తమ చారిత్రాత్మక మ్యాచ్‌కు అవరోధాలు ఎదురవుతున్నాయని.. మరోసారి ఇక్కడకు రాబోమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-2025 సైకిల్‌లో ఈ మ్యాచ్ భాగం కాదు కాబట్టి న్యూజిలాండ్‌కు పెద్దగా వచ్చే నష్టమేమీలేదు. అయితే, వరల్డ్ టెస్టు చాంపియన్‌తో టెస్టు ఆడి.. సత్తా చాటాలని భావించిన అఫ్గన్ ఆటగాళ్లకే తీవ్ర నిరాశ ఎదురైంది.
Comments
Please login to add a commentAdd a comment