అందరూ ఊహించిందే జరిగింది. నోయిడా వేదికగా అఫ్గానిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆట కూడా వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ కనీసం టాస్ పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది.
ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "నోయిడాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు చేయబడింది. ఐదవ రోజు ప్రారంభంలోనే అంపైర్‌లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం బ్లాక్ క్యాప్స్ శ్రీలంకకు పయనం కానున్నారు అని న్యూజిలాండ్ క్రికెట్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.
కాగా ఈ సిరీస్ వాస్తవానికి సెప్టెంబర్ 9న ప్రారంభమవ్వాల్సింది. కానీ కుండపోత వర్షం వల్ల మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. అయితే తొలి రెండు రోజులు పగలు సమయంలో పెద్దగా వర్షం కురవనప్పటకి.. మైదానాన్ని గ్రౌండ్ స్టాప్ సిద్దం చేయలేకపోయారు.
గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో సరైన మౌళిక సదుపాయాలు లేకపోవడమే అందుకు కారణం. గ్రౌండ్‌లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేవు.
ఆ తర్వాత మరింత వర్షాలు కురవడంతో గ్రౌండ్ మొత్తం చిన్నపాటి చెరువులా తయారైంది. ఆఖరి మూడు రోజులు కనీసం ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియం కూడా రాలేదు. అంటే నోయిడా మైదానంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఆర్ధం చేసుకోవచ్చు.
చివరికి టాస్ పడకుండానే అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. టెస్టు క్రికెట్‌లో తమ ఉనికిని చాటుకోవాలని భావించిన అఫ్గానిస్తాన్‌కు నిరాశే ఎదురైంది.
చదవండి: IPL 2025: రోహిత్ ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగాలి.. ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment