వన్డేల్లో అఫ్గన్‌ సంచలనం.. 177 రన్స్‌ తేడాతో సౌతాఫ్రికా చిత్తు | AFG vs SA: Gurbaz Rashid Khan Power Afghanistan Historic ODI Series win | Sakshi
Sakshi News home page

AFG vs SA: వన్డేల్లో అఫ్గన్‌ సంచలన విజయం.. సౌతాఫ్రికాపై సిరీస్‌ గెలుపు

Published Sat, Sep 21 2024 10:47 AM | Last Updated on Sat, Sep 21 2024 11:29 AM

AFG vs SA: Gurbaz Rashid Khan Power Afghanistan Historic ODI Series win

Afghanistan Beat South Africa By 177 Runs Ind 2nd ODI 2024: తమ వన్డే క్రికెట్‌ చరిత్రలో అఫ్గనిస్తాన్‌ సరికొత్త చరిత్ర లిఖించింది. పటిష్ట సౌతాఫ్రికాపై తొలిసారిగా సిరీస్‌ నెగ్గింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి అఫ్గన్‌ జట్టుగా హష్మతుల్లా బృందం నిలిచింది. కాగా అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడేందుకు సౌతాఫ్రికా యూఏఈ పర్యటనకు వెళ్లింది.

ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు
ఈ క్రమంలో షార్జా వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో అనూహ్య రీతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అఫ్గనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇదే తొలి వన్డే విజయం. అనంతరం.. శుక్రవారం షార్జాలోనే జరిగిన రెండో మ్యాచ్‌లోనూ హష్మతుల్లా బృందం సంచలన విజయం సాధించింది.

సౌతాఫ్రికాను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అఫ్గన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తన అద్భుత ప్రదర్శనతో ప్రొటిస్‌ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. 9 ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.

శతక్కొట్టిన గుర్బాజ్‌
షార్జా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 105 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌ రియాజ్‌ హసన్‌ 29 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ రహ్మత్‌ షా(50) హాఫ్‌ సెంచరీ కొట్టాడు.  

ఇక నాలుగో నంబర్‌ బ్యాటర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ సైతం 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్‌ 311 పరుగుల భారీ స్కోరు సాధించింది.

రషీద్‌ ఖాన్‌ వికెట్ల వేట
సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, నండ్రేబర్గర్‌, కాబా పీటర్‌, ఐడెన్‌ మార్క్రమ్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్‌ తెంబా బవుమా 38, మరో ఓపెనర్‌ టోరీ డి జోర్జి 31 పరుగులకే అవుట్‌ అయ్యారు. వీరిద్దరు నిష్క్రమించిన తర్వాత ప్రొటిస్‌ జట్ట బ్యాటింగ్‌ ఆర్డర్‌ను రషీద్‌ ఖాన్‌ కుప్పకూల్చాడు.

టోనీ వికెట్‌తో వేట మొదలుపెట్టిన రషీద్‌ ఖాన్‌.. మార్క్రమ్‌(21), ట్రిస్టన్‌ స్టబ్స్‌(5), కైలీ వెరెన్నె(2), వియాన్‌ మల్డర్‌(2)లను పెవిలియన్‌కు పంపి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. మిగతా పనిని మరో స్పిన్నర్‌ నంగేయాలియా ఖరోటే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో రషీద్‌ ఐదు వికెట్లు దక్కించుకోగా.. ఖరోటే 4, అజ్మతుల్లా ఒమర్జాయ్‌ ఒక వికెట్‌ తీశారు.

అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా- రెండో వన్డే
👉వేదిక: షార్జా క్రికెట్‌ స్టేడియం
👉టాస్‌: అఫ్గనిస్తాన్‌.. తొలుత బ్యాటింగ్‌
👉అఫ్గన్‌ స్కోరు: 311/4 (50)
👉సౌతాఫ్రికా స్కోరు: 134 (34.2)
👉ఫలితం: సౌతాఫ్రికాపై 177 పరుగుల తేడాతో అఫ్గన్‌ సంచలన విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రషీద్‌ ఖాన్‌.

చదవండి: ఇంగ్లండ్‌ గడ్డపై దుమ్ములేపిన చహల్‌.. బంగ్లాతో సిరీస్‌కు సై!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement