స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 2) మొదలైన ఏకైక టెస్ట్‌లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. అషిత ఫెర్నాండో (14.4-1-24-3), విశ్వ ఫెర్నాండో (12-1-51-4), ప్రభాత్ జయసూర్య (25-7-67-3) విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక.. రెండో బంతికే ఆఫ్ఘన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌ను (0) పెవిలియన్‌కు పంపింది. ఆతర్వాత వన్‌డౌన్ ఆటగాడు రెహ్మత్ షా (91).. మరో ఓపెనర్, అరంగేట్రం ఆటగాడు నూర్ అలీ జద్రాన్‌తో (31) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
వీరిద్దరూ ఔటైన అనంతరం ఆఫ్ఘన్లు మరోసారి పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది 17, నసీర్ జమాల్ 0, ఇక్రమ్ అలికిల్ 21, కైస్ అహ్మద్ 21, జియా ఉర్ రెహ్మాన్ 4, నిజత్ మసూద్ 12, మొహమ్మద్ సలీం 0 పరుగులకు ఔటయ్యారు. 44 పరుగుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ చివరి ఆరు వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్‌తో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేయడం విశేషం. నూర్ అలీ జద్రాన్, నవీద్ జద్రాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, మొహమ్మద్ సలీం తమ కెరీర్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ ప్లేయర్లు గైర్హాజరయ్యారు. లీగ్ క్రికెట్‌తో ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా ఆఫ్ఘన్ ప్లేయర్లు లంక పర్యటనకు రాలేకపోయారు.
కాగా, ఓ టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ మొదలవుతుంది. ఫిబ్రవరి 9, 11, 14 తేదీల్లో పల్లెకెలె వేదికగా మూడు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 17, 19, 21 తేదీల్లో డంబుల్లా వేదికగా టీ20 సిరీస్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment