కరుణ్‌ నాయర్‌ ఐపీఎల్‌ ఆడుతున్నాడా..? | After Heroic In VHT, Indian Cricket Fans Are Googling That Karun Nair Is Playing IPL Or Not | Sakshi
Sakshi News home page

కరుణ్‌ నాయర్‌ ఐపీఎల్‌ ఆడుతున్నాడా..?

Published Thu, Jan 16 2025 6:50 PM | Last Updated on Thu, Jan 16 2025 7:05 PM

After Heroic In VHT, Indian Cricket Fans Are Googling That Karun Nair Is Playing IPL Or Not

దేశవాలీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2024-25లో పరుగుల వరద పారిస్తున్న విదర్భ కెప్టెన్‌ కరుణ్‌ నాయర్‌ ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాడు. ఏ ఇద్దరు భారత క్రికెట్‌ అభిమానులు కలిసినా కరుణ్‌ నాయర్‌ గురించిన చర్చే నడుస్తుంది. 2022 డిసెంబర్‌లో డియర్‌ క్రికెట్‌.. మరో ఛాన్స్‌ ఇవ్వు అని ప్రాధేయ పడిన కరుణ్‌, ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. 

ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌ హజారే ట్రోఫీలో కరుణ్‌ గణాంకాలు చూస్తే ఎంతటి వారైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ టోర్నీలో కరుణ్‌ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 752 సగటున 752 పరుగులు (112*, 44*, 163*, 111*, 112, 122*, 88*) చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఓ అర్ద సెంచరీ ఉన్నాయి. ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో కరుణ్‌ కేవలం ఒక్క సారి మాత్రమే ఔటయ్యాడు.

కరుణ్‌ అరివీర భయంకరమైన ఫామ్‌ చూసిన తర్వాత భారత క్రికెట్‌ అభిమానులు ఇతని గురించి లోతుగా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతటి విధ్వంసకర బ్యాటర్‌ అయిన కరుణ్‌ అసలు ఐపీఎల్‌ ఆడుతున్నాడా లేదా అని గూగుల్‌ చేస్తున్నారు. ఆసక్తికరంగా కరుణ్‌ను ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. 

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో డీసీ కరుణ్‌ను 50 లక్షలకు సొంతం చేసుకుంది. కరుణ్‌ గతంలోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. కరుణ్‌కు 2013-22 వరకు ఐపీఎల్‌ ఆడిన అనుభవం ఉంది. ఈ మధ్యకాలంలో అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 76 మ్యాచ్‌లు ఆడి 10 అర్ద సెంచరీల సాయంతో 1496 పరుగులు చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్‌ తర్వాత టెస్ట్‌ల్లో భారత్‌ తరఫున ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్‌ అయిన కరుణ్‌ కేవలం కొంతకాలం మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌ ఆడగలిగాడు. తన మూడో మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ చేసిన కరుణ్‌ ఆతర్వాత సరైన అవకాశాలు రాక కనుమరుగయ్యాడు. తిరిగి ఏడేళ్ల తర్వాత కరుణ్‌ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. టీమిండియా సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి రిటైర్మెంట్‌కు దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్‌కు అవకాశాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం కరుణ్‌ ఉన్న ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తే మూడు ఫార్మాట్లలో భారత జట్టులో పాగా వేయడం ఖాయం. కరుణ్‌ 2016-17 మధ్యలో భారత్‌ తరఫున 6 టెస్ట్‌లు, రెండు వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో ట్రిపుల్‌ సెంచరీ మినహాయించి కరుణ్‌కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు.

కాగా, విజయ్‌ హజారే ట్రోఫీలో ఇవాళ (జనవరి 16) జరుగుతున్న మ్యాచ్‌లో కరుణ్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. మహారాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో కరుణ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్‌ 44 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  కరుణ్‌ విధ్వంసం​ ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల రికార్డు స్కోర్‌ చేసింది. విజయ్‌ హజారే ట్రోఫీ చరిత్రలో విదర్భకు ఇదే అత్యధిక స్కోర్‌.

మహారాష్ట్రతో మ్యాచ్‌లో కరుణ్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడగా.. విదర్భ ఓపెనర్లు దృవ్‌ షోరే (120 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 114 పరుగులు), యశ్‌ రాథోడ్‌ (101 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 116 పరుగులు) సెంచరీలు చేశారు. దృవ్‌, యశ్‌ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 224 పరుగులు జోడించారు. తదనంతరం కరుణ్‌ నాయర్‌తో పాటు జితేశ్‌ శర్మ (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement