టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ‘ముఖ్యమైన ప్రకటన’కు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. దివ్యాంగులైన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేలా.. తాము తలపెట్టిన సత్కార్యం విజయవంతమైందని తెలిపాడు. తమకు సహకరించిన తోటి క్రికెటర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. అసలు విషయమేమిటంటే..
‘నేనొక ప్రకటన చేయబోతున్నా.. ’ అంటూ కేఎల్ రాహుల్ ఇన్‌స్టా పోస్ట్ పెట్టగానే.. అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలకబోతున్నాడంటూ వదంతులు వ్యాపించాయి. జాతీయ జట్టులో తగినన్ని అవకాశాలు రాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా ఇవన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేశాడు కేఎల్ రాహుల్.
తన భార్య అతియా శెట్టితో కలిసి ఒక మంచి పని చేసినట్లు వెల్లడించాడు. దివ్యాంగులైన పిల్లల బాగు కోసం.. క్రికెటర్ల వస్తువులు వేలం వేయడం ద్వారా నిధులు సమకూర్చినట్లు తెలిపాడు. ఈ సత్కార్యంలో తమకు సహకరించిన తన సహచర, మాజీ క్రికెటర్ల జట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. వేలాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, విరాళాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపాడు.
కోహ్లి జెర్సీకి అత్యధిక ధర
కేఎల్ రాహుల్- అతియా శెట్టి దంపతులు నిర్వహించిన ఈ వేలంలో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి జెర్సీ అత్యధిక ధర పలికినట్లు సమాచారం. రూ. 40 లక్షలకు కింగ్ జెర్సీ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అదే విధంగా... ఈ జాబితాలో రెండో స్థానంలో కూడా కోహ్లినే ఉండటం విశేషం. అతడి గ్లోవ్స్ రూ. 28 లక్షల ధర పలికింది.
ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ రూ. 24 లక్షలు, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ రూ. 13 లక్షలు, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ బ్యాట్ రూ. 11 లక్షలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వేలం ద్వారా రాహుల్- అతియా మొత్తంగా రూ. 1.93 కోట్లు సేకరించినట్లు సమాచారం.
కాగా ఐపీఎల్-2024లో స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కలేదు. టీమిండియా తరఫున 2022లో చివరి టీ20 ఆడిన రాహుల్.. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు. ఇదే ఏడాది జనవరిలో ఆఖరిగా టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఈ కర్ణాటక బ్యాటర్ తదుపరి దులిప్ ట్రోఫీలో పాల్గొననున్నాడు.
చదవండి: BAN vs PAK: తండ్రైన స్టార్ క్రికెటర్.. టెస్టు సిరీస్ నుంచి ఔట్?
Comments
Please login to add a commentAdd a comment