వరుసగా నాలుగో సెంచరీ: ‘టీమిండియా ఓపెనర్‌గా ఫిక్స్‌’! | Again Century: Fans Demand Abhimanyu Easwaran in BGT 2024 India Squad | Sakshi
Sakshi News home page

మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే!

Published Mon, Oct 14 2024 12:56 PM | Last Updated on Mon, Oct 14 2024 2:25 PM

Again Century: Fans Demand Abhimanyu Easwaran in BGT 2024 India Squad

బెంగాల్‌ బ్యాటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ మళ్లీ శతక్కొట్టాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తూ టీమిండియా సెలక్టర్లకు గట్టి సవాల్‌ విసిరాడు. వరుసగా నాలుగు సెంచరీలు బాది అరంగేట్రానికి తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు.

ఉత్తరాఖండ్‌లో జన్మించిన అభిమన్యు ఈశ్వరన్‌ దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌ జట్టుకు ఆడుతున్నాడు. ఈ క్రమంలో తాజా రంజీ ట్రోఫీ ఎడిషన్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. లక్నో వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగాల్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఈ క్రమంలో అభిమన్యు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 5 పరుగులకే పరిమితమయ్యాడు.

వరుసగా నాలుగో సెంచరీ
అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ శతకంతో చెలరేగాడు. మొత్తంగా 172 బంతులు ఎదుర్కొని 127 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఇటీవలి కాలంలో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అభిమన్యుకు ఇది వరుసగా నాలుగో సెంచరీ(ఓవరాల్‌గా 27వది). 

దులిప్‌ ట్రోఫీ-2024లో రెండు శతకాలు బాదిన 29 ఏళ్ల అభిమన్యు.. ఇరానీ కప్‌-2024 మ్యాచ్‌లోనూ సెంచరీ కొట్టాడు. తాజాగా రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనూ వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించడంతో పాటు భారత్‌-‘ఎ’ తరఫున ఆడి జట్టుకు ఎన్నో విజయాలు అందించిన అభిమన్యు.. ఇంత వరకు టీమిండియా తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. 

బ్యాకప్‌ ఓపెనర్‌!
స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ ఆడే జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. కివీస్‌తో టెస్టులకు ప్రకటించిన జట్టులో ఓపెనింగ్‌ స్లాట్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ మాత్రమే ఉన్నారు. అయితే, ఆస్ట్రేలియాతో పర్యటనలో మాత్రం టీమిండియా ఈ రిస్క్‌ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి కచ్చితంగా బ్యాకప్‌ ఓపెనర్‌ను ఎంపిక చేస్తారు. 

అయితే,  ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా ఈసారి అభిమన్యు ఈశ్వరన్‌కు ఆ అవకాశం దక్కవచ్చు. రుతురాజ్‌ గైక్వాడ్‌తో పోలిస్తే ఫామ్‌ దృష్ట్యా అభిమన్యుకే ఆ ఛాన్స్‌ ఎక్కువగా ఉంది. అయితే, గతంలోనూ బ్యాకప్‌ ఓపెనర్‌గా ఎంపికైనా.. తుదిజట్టులో మాత్రం అభిమన్యుకు చోటుదక్కలేదు.

రోహిత్‌ శర్మ దూరంగా ఉంటే!
ఈసారి మాత్రం అభిమన్యుకు అదృష్టం వరించే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో ఆరంభ టెస్టులకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరంగా ఉండనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి యశస్వి జైస్వాల్‌కు జోడీగా అభిమన్యుకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో స్థానం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

కాగా రెడ్‌బాల్‌ క్రికెట్‌లో గత నాలుగు మ్యాచ్‌లలో అభిమన్యు చేసిన స్కోర్లు వరుసగా 157*, 116, 191, 127*. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడబోయే భారత జట్టులో చోటివ్వాలని అతడి అభిమానుల నుంచి బీసీసీఐకి డిమాండ్లు ఎక్కువయ్యాయి.

చదవండి: Asia Cup 2024:భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement