న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాపై అద్భుత సిరీస్ విజయంలో కెప్టెన్‌గా అజింక్య రహానే ఎంతో కీలకపాత్ర పోషించాడు. దాంతో టెస్టులకు విరాట్ కోహ్లి స్థానంలో రహానేను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించాలంటూ చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన రహానే తన వ్యాఖ్యలతో తాజా చర్చకు ముగింపు పలికే ప్రయత్నం చేశాడు. భారత జట్టుకు కోహ్లి మాత్రమే నాయకుడని అతను స్పష్టం చేశాడు. ‘ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కోహ్లి కెప్టెన్‌గా, నేను వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నాం. ఈ హోదాలు మారడం వల్ల జట్టులో ఎలాంటి మార్పు రాదు. ఎప్పటికీ కోహ్లినే మా టీమ్ కెప్టెన్. నేను అతడికి డిప్యూటీని మాత్రమే. అతను లేనప్పుడు జట్టుకు నాయకత్వం వహించడం, నా అత్యుత్తమ ప్రదర్శనతో టీమ్ గెలిచేలా చేయడమే నా బాధ్యత. నేను అదే పని చేశాను’ అని రహానే వ్యాఖ్యానించాడు.
జట్టులో హోదాకంటే అప్పజెప్పిన పనిని ఎంత బాగా చేశామనేదే ముఖ్యమని అతను అభిప్రాయపడ్డాడు. ‘పేరుకు కెప్టెన్ అని ఉంటే సరిపోదు. నాయకుడిగా నువ్వు ఎంత సమర్థంగా వ్యవహరిస్తావనేది కీలకం. ఇప్పటి వరకు నేను మంచి ఫలితాలే సాధించాను. ఇక ముందు కూడా సాధిస్తా. జట్టుకు ఇలాంటి విజయాలు అందించేందుకు ఇంకా ప్రయత్నిస్తా’ అని విశ్లేషించాడు. నాయకత్వం విషయంలో ప్రతీ ఒక్కరికీ భిన్నమైన శైలి ఉంటుందని రహానే గుర్తు చేశాడు. ‘కెప్టెన్సీ విషయంలో ఎవరికి వారు ప్రత్యేకం. సరిగ్గా చెప్పాలంటే జట్టు బాగుంటేనే కెప్టెన్ కూడా గొప్పగా అనిపిస్తాడు. మ్యాచ్‌లు లేదా సిరీస్ గెలవడం అనేది ఏ ఒక్కరివల్లో కాకుండా సమష్టి కృషి ఫలితం. కాబట్టి మీ జట్టు మిమ్మల్ని గొప్ప నాయకుడిగా మారుస్తుంది. తాజా సిరీస్ విజయం నా జట్టు సాధించిందే’ అని రహానే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
పరస్పర నమ్మకం, గౌరవం
కోహ్లితో తన వ్యక్తిగత సంబంధాల విషయంలో ఎప్పుడూ ఎలాంటి ఢోకా లేదని రహానే పునరుద్ఘాటించాడు. ‘నాకూ, కోహ్లికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్నోసార్లు అతను నా బ్యాటింగ్‌ను ప్రశంసించాడు. ఇద్దరం కలిసి విదేశాల్లో జట్టు కోసం పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాం. అతను నాలుగో స్థానంలో, నేను ఐదో స్థానంలో ఆడటం వల్ల పలు మంచి భాగస్వామ్యాలు నమోదయ్యాయి. ఒకరి ఆటపై మరొకరు పరస్పరం నమ్మకం ఉంచాం. క్రీజ్‌లో ఉన్నప్పుడు ప్రత్యర్థి బౌలింగ్‌ను దెబ్బ తీయడంపై చర్చించడం, తప్పుడు షాట్‌లు ఆడినప్పుడు హెచ్చరించుకోవడం తరచూ జరిగాయి. విరాట్ చురుకైన నాయకుడు. మైదానంలో వేగంగా సరైన నిర్ణయాలు తీసుకోగలడు. ముఖ్యంగా స్పిన్నర్లు బౌలింగ్ చేసేటప్పుడు స్లిప్‌లో నేను చక్కటి క్యాచ్‌లు అందుకోగలనని నన్ను గట్టిగా నమ్ముతాడు.
నా నుంచి అతను ఎంతో ఆశిస్తాడు. నేను కూడా సాధ్యమైనంత వరకు కోహ్లి నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను’ అని రహానే సుదీర్ఘంగా వివరించాడు. గత కొంత కాలంగా తాను ఫామ్‌లో లేకపోయినా జట్టులో స్థానం కోల్పోతానని ఆందోళన చెందలేదని రహానే గుర్తు చేసుకున్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే నా స్థానానికి ప్రమాదం ఏర్పడినట్లు ఎప్పుడూ అనుకోలేదు. కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్ నాపై నమ్మకముంచింది. ఫామ్ తాత్కాలికం అని నేనూ నమ్ముతాను. కొన్నిసార్లు వరుసగా విఫలం కావడం జరుగుతుంది. దానర్థం అతనేమీ ఆటను మరచిపోయినట్లు కాదు. ఒక్క మంచి ఇన్నింగ్స్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావచ్చు. నేను వరుసగా విఫలమవుతున్న సమయంలో కెప్టెన్ నాలో స్థయిర్యాన్ని నింపాడు. మరొకరు మనకు అండగా నిలుస్తున్నారని తెలిస్తే ఆందోళన తగ్గుతుంది. మరో ఆలోచన లేకుండా ఆటపై దృష్టి పెట్టవచ్చు’ అని ఈ ముంబైకర్ వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment