
ఆర్సీబీపై రాయుడు వ్యాఖ్యలు(PC: Insta/IPL)
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu)కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుRCB) మాజీ కోచ్ సంజయ్ బంగర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రతిసారీ ఆర్సీబీని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని.. తాను ఇలాంటివి సహించలేనని పేర్కొన్నాడు.
కాగా అంబటి రాయుడు గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై టైటిళ్లు గెలిచిన సందర్భాల్లో అతడు జట్టులో ఉన్నాడు.
రికార్డుల రారాజు ఉన్న జట్టు
ఇక ఐపీఎల్‌లో ఏకంగా ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ రెండు జట్లకు ఉన్నంత స్థాయిలో ఆర్సీబీకి కూడా క్రేజ్ ఉంది. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా బెంగళూరు ఫ్యాన్‌బేస్ రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదనడంలో సందేహం లేదు.
ఇందుకు ప్రధాన కారణం రికార్డుల రారాజు, టీమిండియా ముఖచిత్రం విరాట్ కోహ్లి మొదటి నుంచి ఆ జట్టులో భాగం కావడమే! అయితే, రాయుడు మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆర్సీబీని కించపరిచే విధంగా మాట్లాడతాడనే అభిప్రాయం ఉంది.
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఆర్సీబీ ఏదో ఒకరోజు ట్రోఫీ గెలుస్తుందని.. అయితే, ఆ సమయం ఎప్పుడూ రాకూడదని తాను ఎల్లప్పుడూ ప్రార్థిస్తానని వ్యాఖ్యానించాడు.
అన్ని జట్లకూ సాధ్యం కాదు
ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ వేళ కామెంట్రీ చేస్తున్న సమయంలోనూ అంబటి రాయుడు మరోసారి ఆర్సీబీని అవహేళన చేశాడు. ఈ ఫ్రాంఛైజీ గురించి మాజీ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘‘గత నాలుగైదేళ్లుగా జట్టు నిలకడైన ప్రదర్శన కనబరుస్తోంది. నాలుగు సందర్భాల్లో ప్లే ఆఫ్స్ చేరింది.
గతేడాది వరుసగా ఏడు మ్యాచ్‌లు ఓడిన తర్వాత కూడా టాప్-4లో అడుగుపెట్టగలిగింది. వరుస పరాజయాల తర్వాత ఇలా తిరిగి పుంజుకోవడం అన్ని జట్లకూ సాధ్యం కాదు. కాబట్టి త్వరలోనే వాళ్లు ప్రతి అవాంతరాన్ని అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఇది తప్పు
ఇందుకు అంబటి రాయుడు బదులిస్తూ.. ‘‘నిజమే.. సంజయ్ భాయ్.. వచ్చేసారి ఆర్సీబీ అవాంతరాలు దాటుతుంది. క్వాలిఫయర్ 2 వరకైనా వెళ్తుంది’’ అని నవ్వాడు. ఇందుకు స్పందనగా.. ‘‘ఇది చాలా తప్పు. మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. నేను ఇలాంటివి సహించలేను. ఆర్సీబీ అభిమానులు మిమ్మల్ని చూస్తున్నారు’’ అంటూ నవ్వుతూనే రాయుడు వ్యాఖ్యల్ని బంగర్ తప్పుబట్టాడు.
ఇందుకు రాయుడు.. ‘‘చూస్తే చూడనివ్వండి’’ అంటూ మరోసారి ఆర్సీబీని అపహాస్యం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బెంగళూరు ఫ్రాంఛైజీ ఫ్యాన్స్ రాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూర్ఖత్వం
తను హైలైట్ అయ్యేందుకు ప్రతిసారీ ఆర్సీబీని తక్కువ చేసి చూపుతున్నాడని.. ఆ జట్టుకు ఉన్న క్రేజ్‌లో వీసమైంత గుర్తింపు అయిన దక్కించుకోవాలని భలే ఆరాటపడుతున్నాడని సెటైర్లు వేస్తున్నారు.
ఒక జట్టును పదే పదే కించపరచడం ద్వారా తన స్థాయి పెరుగుతుందని భావిస్తున్నాడని.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదంటూ రాయుడుకు చురకలు అంటిస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీల పట్ల రాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు.
నీదే పబ్లిసిటీ స్టంట్
కాగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు చిరంజీవి, సుకుమార్ తదితరులు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, వారిని ఉద్దేశించి.. టీవీల్లో కనిపించాలని ఇలాంటి వారు ఇక్కడికి వస్తారంటూ రాయుడు వ్యాఖ్యానించాడు.
ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని పేర్కొన్నాడు. దీంతో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పుడదే మాటను రాయుడు ఆపాదించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment