ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో అమెరికా స్టార్
డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్ కూడా
పారిస్: పట్టుదలతో పోరాడిన అమెరికా టెన్నిస్ యంగ్‌స్టార్ కోకో గాఫ్ వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ కోకో గాఫ్ 4–6, 6–2, 6–3తో ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీíÙయా)పై గెలిచింది.
ఐదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న కోకో గాఫ్ తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించడం విశేషం. 2023 యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన కోకో ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లో నిష్క్రమించింది. జబర్‌తో గంటా 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కోకో ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది.
21 విన్నర్స్ కొట్టిన ఆమె నెట్ వద్ద 11 పాయింట్లు గెలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–0, 6–2తో ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై అలవోకగా గెలిచి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 62 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.
వైదొలిగిన జొకోవిచ్
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మోకాలి గాయంతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. సెరున్‌డొలో (అర్జెంటీనా)తో 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–1, 5–7, 3–6, 7–5, 6–3తో గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
ఈ మ్యాచ్ సందర్భంగా జొకోవిచ్ జారిపడటంతో అతని మోకాలికి గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగకూడదని నిర్ణయం తీసుకొని టోర్నీ నుంచి వైదొలిగాడు.
కొత్త నంబర్‌వన్ సినెర్
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ఇటలీ స్టార్ యానిక్ సినెర్ కొత్త ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించనున్నాడు. జొకోవిచ్ టోర్నీ నుంచి వైదొలగడం... సినెర్ సెమీఫైనల్ చేరుకోవడంతో ఈ ఇటలీ స్టార్ ఈనెల పదో తేదీన విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్ స్థానాన్ని అందుకుంటాడు.
క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–2, 6–4, 7–6 (7/3)తో పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలిచి కెరీర్‌లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment