పదకొండు ఇన్నింగ్స్.. 542 రన్స్.. సగటు 67.75.. స్ట్రైక్ రేటు 148.08.. అత్యధిక స్కోరు 113 నాటౌట్. ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇప్పటి దాకా నమోదు చేసిన గణాంకాలు. ఇక పదకొండింట జట్టు గెలిచిన మ్యాచ్‌లు నాలుగు.
వరల్డ్‌కప్ జట్టులోనూ అతడి స్థానాన్ని ప్రశ్నిస్తూ
ఈ సీజన్ ఆరంభం నుంచి కోహ్లి మెరుగ్గానే ఆడుతున్నా.. జట్టు వరుస పరాజయాల పాలవడంతో అతడి స్ట్రైక్‌రేటు చర్చనీయాంశంగా మారింది. మిగతా ఆటగాళ్లు ఎంతగా విఫలమవుతున్నా పట్టించుకోని కొందరు కామెంటేటర్లు అదే పనిగా కోహ్లి ఆట తీరును విమర్శించడం.. వరల్డ్‌కప్ జట్టులోనూ అతడి స్థానాన్ని ప్రశ్నించడం వంటివి చేశారు.
మరికొందరు మాజీ క్రికెటర్లు మాత్రం జట్టు ప్రయోజనాలు, పరిస్థితులకు అనుగుణంగా ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆడుతున్నాడంటూ కోహ్లిని సమర్థించారు. ఈ నేపథ్యంలో కోహ్లి స్పందిస్తూ.. ‘‘బయట ఎక్కడో కూర్చుని మాట్లాడేవాళ్ల కామెంట్లను పట్టించుకోను. జట్టు కోసం ఏం చేయాలో నాకు తెలుసు’’ అంటూ విమర్శకులకు కౌంటర్ వేశాడు.
మీ అంత కాకపోయినా.. మేమూ కాస్త క్రికెట్ ఆడాము
ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ‘‘అవునా.. చాలా మంది మేము బయట వాగుడు పట్టించుకోం అని గంభీరాలు పలుకుతూ ఉంటారు.
మరెందుకని ఇలాంటి రిప్లైలు ఇస్తూ ఉంటారు. మీ అంత కాకపోయినా.. మేమూ కాస్త క్రికెట్ ఆడాము. మాకేమీ అజెండాలు ఉండవు. మేము ఏం చూస్తున్నామో దాని గురించే మాట్లాడతాం.
మాకు ఒకరంటే ఇష్టం.. మరొకరంటే కోపం ఉండదు. ఏం జరుగుతుందో దాని గురించే మాట్లాడతాం’’ అని గావస్కర్ అన్నాడు. ఈ నేపథ్యంలో గావస్కర్‌పై కోహ్లి ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. గతంలో.. కోహ్లిని విమర్శించే క్రమంలో అతడి భార్య అనుష్క శర్మను ఉద్దేశించి గావస్కర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏకిపారేస్తున్నారు.
ప్రతిసారీ కోహ్లి గురించే మాట్లాడటం ద్వారా ఎల్లపుడూ వార్తల్లో ఉండేందుకు చేసే ప్రయత్నమే ఇదంటూ మండిపడుతున్నారు. గతంలో గావస్కర్ 176 బంతుల్లో 36 పరుగులు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. జట్టు ప్రయోజనాల కోసం మీరు ఏం చేసినా చెల్లుబాటే గానీ.. కోహ్లి చేస్తే మాత్రం తప్పా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
విమర్శలు సరికాదు
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం స్పందిస్తూ.. కోహ్లి ఒక్కడే జట్టును గెలిపించలేడని.. అనవసరంగా అతడిని తక్కువ చేసి మాట్లాడవద్దని కామెంటేటర్లకు హితవు పలికాడు.
ఆర్సీబీలో మిగతా బ్యాటర్లు కూడా రాణిస్తేనే కోహ్లిపై ఒత్తిడి తగ్గి స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలడని అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్‌లో వరుస పరాజయాలతో చతికిల పడ్డ ఆర్సీబీ.. హ్యాట్రిక్ విజయాలతో గాడిలో పడింది.
చదవండి: ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment