టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవ్ వాట్‌మోర్ విమర్శలు గుప్పించాడు. అతడిని బరోడా ఆటగాడని సంబోంధించడం సరికాదన్నాడు.
హార్దిక్ దేశవాళీ క్రికెట్ ఆడి ఎన్నో ఏళ్లు గడిచిపోయిందని.. అతడికి ఐపీఎల్ వంటి లీగ్‌లపై మాత్రమే శ్రద్ధ ఎక్కువని సెటైర్లు వేశాడు. అయినా తన గురించి ప్రస్తావన వచ్చినపుడు బరోడా ఆల్‌రౌండర్ అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నాడు వాట్‌మెన్.
కాగా భారత వన్డే, టీ20 క్రికెట్ జట్టులో కీలక సభ్యుడైన హార్దిక్ పాండ్యా స్వస్థలం గుజరాత్. తన అన్న కృనాల్ పాండ్యాతో కలిసి బరోడా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన హార్దిక్.. 2018 తర్వాత మళ్లీ అక్కడ కనిపించలేదు.
అయితే, ఇటీవల బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఫిట్‌నెస్ కారణాల వల్ల జట్టుకు దూరమైన ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడిన తర్వాతే టీమిండియా సెలక్షన్ సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.
అంతేకాదు.. శ్రీలంక పర్యటనకు జట్టును ప్రకటించినపుడు కూడా ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. దీంతో హార్దిక్ పాండ్యాకు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఇప్పటికే ఫిట్‌నెస్ సమస్యల వల్ల కెప్టెన్సీకి దూరమైన హార్దిక్.. వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో.. బరోడా జట్టు కోచ్‌గా పనిచేసిన ఆసీస్ మాజీ క్రికెటర్ డేవ్ వాట్‌మోర్ ఓ పాకిస్తానీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘‘చాలా మంది దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడరు. నేను రెండేళ్ల పాటు బరోడా జట్టుతో ఉన్న సమయంలో పాండ్యా ఒక్కసారి కూడా ఆడలేదు.
అయినప్పటికీ తనను బరోడా ఆల్‌రౌండర్ అని పిలుచుకోవడం సరికాదనిస్తుంది. చాలా ఏళ్ల పాటు అతడు ఆ జట్టుకు దూరంగా ఉన్నా ఇంకా అక్కడి ఆటగాడిగా గుర్తించడం ఏమిటో?!
ఇటీవల బీసీసీఐ తెచ్చిన నిబంధనలు నాకు నచ్చాయి. రంజీ ట్రోఫీలో అందరూ ఆడాలని.. మిగిలిన రెండు ఫార్మాట్లలో కూడా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని చెప్పింది. 4-డే క్రికెట్‌ను ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.
కాగా శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లకు కోచ్‌గా వ్యవహరించి విజయవంతమైన శిక్షకుడిగా పేరొందాడు వాట్‌మోర్. 2021-22, 2022- 23 సీజన్లలో బరోడా కోచ్‌గా సేవలు అందించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో టీమిండియా టీ20 సిరీస్‌కు హార్దిక్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. వన్డేల్లో మొండిచేయి చూపారు.
Comments
Please login to add a commentAdd a comment