
జేమ్స్ ఆండర్సన్ ప్రపంచ రికార్డు (PC: ECB)
Ind vs Eng- James Michael Anderson 700 Test Wickets: ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఆండర్సన్ ఈ ఘనత సాధించాడు.
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ధర్మశాలలో నామమాత్రపు ఐదో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో.. మూడో రోజు ఆటలో టీమిండియా 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
అయితే, శనివారం నాటి ఆట ఆరంభమైన కాసేపటికే జేమ్స్ ఆండర్సన్ నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్(30)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆండర్సన్ ఖాతాలో 700వ టెస్టు వికెట్ జమ అయింది. ఈ క్రమంలో.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి పేసర్‌గా అతడు రికార్డు సాధించాడు. 41 ఏళ్ల వయసులో ఆండర్సన్ ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే
ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక- స్పిన్నర్)- 800
షేన్ వార్న్(ఆస్ట్రేలియా- స్పిన్నర్)- 708
జేమ్స్ ఆండర్సన్(ఇంగ్లండ్- పేసర్)- 700*
అనిల్ కుంబ్లే(ఇండియా- స్పిన్నర్)- 619
స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్- పేసర్)- 604