మహారాష్ట్ర చేతిలో ఆంధ్ర ఓటమి
విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్
ముంబై: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆంధ్ర జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 5 వికెట్ల తేడాతో మహారాష్ట్ర చేతిలో ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శశికాంత్ (25 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ షాట్లతో అజేయ అర్ధశతకం సాధించాడు.
అశ్విన్ హెబర్ (85 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (75 బంతుల్లో 42; 2 ఫోర్లు, 1 సిక్స్), రికీ భుయ్ (47 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్), వినయ్ కుమార్ (40 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రీకర్ భరత్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో ఆంధ్ర జట్టుకు మంచి ఆరంభం లభించలేదు.
ఆఖర్లో శశికాంత్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో పోరాడే స్కోరు చేయగలిగింది. మహారాష్ట్ర బౌలర్లలో రజనీశ్ గుర్బానీ 3, ముకేశ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం మహారాష్ట్ర 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిద్ధేశ్ వీర్ (124 బంతుల్లో 115 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా... రాహుల్ త్రిపాఠి (78 బంతుల్లో 69; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు.
ఆంధ్ర బౌలర్లలో సందీప్ 2 వికెట్లు తీశాడు. గ్రూప్‌లో 6 మ్యాచ్‌లాడిన ఆంధ్ర 4 విజయాలు, 2 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment