అశ్విన్‌పై సంచలన వ్యాఖ్యలు (PC: BCCI)
టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్.. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత గడ్డ మీద తన కోసమే ప్రత్యేకంగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు తయారు చేయిస్తారని పేర్కొన్నాడు. అందుకే ఇండియాలో తప్ప SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)లో అతడి పప్పులు ఉడకవని తీవ్రస్థాయిలో విమర్శించాడు.
కాగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌లో భాగమయ్యే కామెంటేటర్ల పేర్లను ఐసీసీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కామెంటరీ ప్యానెల్‌లో చోటు ఆశించి భంగపడిన టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఐసీసీపై విమర్శలు గుప్పించాడు.
‘‘కామెంటరీ ప్యానెల్‌లో సరైన స్పిన్నర్ ఒక్కరికీ చోటు దక్కలేదు. టోర్నీలో ఇండియాలో జరుగుతున్నా ఇదే పరిస్థితి. స్పిన్ బౌలింగ్ గురించి సాధారణ ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది? వారిని ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు?
కేవలం బ్యాటర్లు, శ్వేత జాతీయులకు మాత్రమే గేమ్ గురించి తెలుసా? విచారకరం’’ అని శివరామకృష్ణన్ ఎక్స్ ఖాతా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు స్పందించిన ఓ నెటిజన్..
‘‘టీమిండియా బ్యాటర్లు ముఖ్యంగా కింగ్(విరాట్ కోహ్లి) స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇంకానయం మనోళ్లు ఆఖర్లో అశ్విన్‌ను తీసుకున్నారు. ఒకవేళ వికెట్లు పడ్డా తను బ్యాటింగ్‌లోనూ రాణించగలడు. పిచ్‌లు ఫ్లాట్‌గా ఉంటేనే’’ అని కామెంట్ చేశాడు.
ఇందుకు బదులుగా.. ‘‘ఇండియాలో టెస్టు మ్యాచ్‌లలో పిచ్‌లు అశ్విన్ కోసమే తయారు చేస్తారు కాబట్టి టీమిండియా బ్యాటర్లు స్పిన్ ఆడలేకపోతున్నారు. మరి SENA దేశాల్లో అతడి రికార్డు ఎప్పుడైనా గమనించారా?’’ అని శివరామకృష్ణన్ పేర్కొన్నాడు.
ఆ తర్వాత సంభాషణ కొనసాగగా.. ‘‘టాంపెరింగ్ చేసిన పిచ్‌లపై ఫూల్స్ కూడా వికెట్లు తీయగలరు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గ్రౌండ్‌కు వెళ్లి అక్కడి సిబ్బందిని కలిసి టాంపర్ చేయాల్సిన ఏరియాల గురించి చెప్పే వారిని నా కళ్లారా చూశాను.
ఇండియాలోనే 378 వికెట్లు. ఇప్పటికీ అతడు ఆడుతున్నాడంటే మిగతా వాళ్లకు ఛాన్స్‌లు లేవని అర్థం. మోస్ట్ అన్‌ఫిట్ క్రికెటర్. ప్రతిదానికి ఓ సాకు వెదుక్కుంటాడు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
దీంతో అశ్విన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన కొంతమంది నెటిజన్లు మీ అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందా అని ప్రశ్నించగా.. లేదు.. ఇది నేనే అని లక్ష్మణ్ శివరామకృష్ణన్ సమాధానమిచ్చాడు. కాగా శివరామకృష్ణన్ 1983-87 మధ్య టీమిండియా తరఫున ఏడు టెస్టులు, పదహారు వన్డేలు ఆడాడు.
చదవండి: WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment