MI: అర్జున్‌ టెండుల్కర్‌ ‘ఓవరాక్షన్‌’.. ఆ తర్వాత ఇలా డగౌట్‌లో! | Is Arjun Tendulkar FAKE His INJURY? MI Pacer Suspiciously Leaves Ground, Fans Trolls | Sakshi
Sakshi News home page

MI: అంతా ఫేక్‌!.. అర్జున్‌ టెండుల్కర్‌ ఓవరాక్షన్‌.. ఆ తర్వాత ఇలా!

Published Sat, May 18 2024 12:52 PM | Last Updated on Sat, May 18 2024 3:42 PM

Is Arjun Tendulkar FAKE His INJURY? MI Pacer Suspiciously Leaves Ground, Fans Trolls

అర్జున్‌ టెండుల్కర్‌ (PC: BCCI/Jio cinema)

టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అతి చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని.. అయినా పరిస్థితులు ఎదుర్కోకుండా పారిపోవడం ఏమిటంటూ నెటిజన్లు అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్‌ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్‌ టెండుల్కర్‌ 2024 సీజన్‌లో ఎట్టకేలకు శుక్రవారం తన తొలి మ్యాచ్‌ ఆడాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో కేవలం 2.2 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఈ రైటార్మ్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌ 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. కాగా.. లక్నో ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌ బౌల్‌ చేసిన అర్జున్‌.. 3 పరుగులు మాత్రమే ఇచ్చి శెభాష్‌ అనిపించుకున్నాడు.

అయితే, ఐదో ఓవర్లో కాస్త అతి చేశాడు. మార్కస్‌ స్టొయినిస్‌ను ట్రాప్‌ చేసేందుకు అర్జున్‌ ఇన్‌స్వింగర్‌ సంధించగా.. బ్యాటర్‌ తప్పించుకున్నాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న అర్జున్‌ వికెట్లకు స్టొయినిస్‌ మీదకు విసిరేస్తానన్నట్లుగా దూకుడు ప్రదర్శించాడు. ఇందుకు స్టొయినిస్‌ చిరాగ్గా నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు.

ఇక ఆ తర్వాత 15వ ఓవర్లో మళ్లీ బాలింగ్‌కు దిగిన అర్జున్‌ టెండుల్కర్‌ బౌలింగ్‌లో నికోలసన్‌ పూరన్‌ తొలి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. అయితే, ఆ తర్వాత అర్జున్‌ తనకు ఇబ్బంది ఉందంటూ ఫిజియోను పిలిపించుకున్నాడు.

ఆ తర్వాత అతడితో కలిసి మైదానం వీడగా.. నమన్‌ ధిర్‌ మిగిలిన కోటా పూర్తి చేశాడు. అయితే, ఆ ఓవర్లో టెండుల్కర్‌ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన పూరన్‌.. తర్వాత నమన్‌ ధిర్‌ బౌలింగ్‌లోనూ వరుసగా సిక్స్‌, ఫోర్‌, 1, సిక్స్‌ బాది 29 పరుగులు పిండుకున్నాడు.

ఈ నేపథ్యంలో అర్జున్‌ టెండుల్కర్‌ కావాలనే గాయం పేరిట తప్పించుకున్నాడంటూ నెటిజన్లు అతడిని ట్రోల్‌ చేస్తున్నారు. పూరన్‌ ఫామ్‌ చూసి భయపడిపోయిన అర్జున్‌ను కాపాడేందుకు మేనేజ్‌మెంట్‌ నమన్‌ ధిర్‌ను బలి చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సందర్భంగా స్టొయినిస్‌ విషయంలో అర్జున్‌ ప్రవర్తించిన తీరు కూడా ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.కాగా సచిన్‌ టెండుల్కర్‌ ముంబై ఇండియన్స్‌ మెంటార్‌ అన్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో అర్జున్‌ మూడు వికెట్లు తీయడంతో పాటు 13 పరుగులు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement