
విజయ్ హజారే వన్డే ట్రోఫీలో టీమిండియా టీ20 స్పెషలిస్ట్, పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్ రెచ్చిపోయాడు. ముంబైతో ఇవాళ (డిసెంబర్ 28) జరుగుతున్న మ్యాచ్‌లో అర్షదీప్ నిప్పులు చెరిగాడు. ఫలితంగా ముంబై టాపార్డర్ కకావికలమైంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అర్షదీప్ ధాటికి ముంబై 61 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అర్షదీప్ ముంబై టాపార్డర్ మొత్తాన్ని నేలకూల్చాడు. టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే సహా దేశవాలీ సంచలనాలు రఘువంశీ, ఆయుశ్ మాత్రే వికెట్లు పడగొట్టాడు. 23.5 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్ 119/7గా ఉంది. అథర్వ అంకోలేకర్ (17), శార్దూల్ ఠాకూర్ (5) క్రీజ్‌లో ఉన్నారు.
పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 5, సన్వీర్ సింగ్, రఘు శర్మ తలో వికెట్ పడగొట్టారు. ముంబై బ్యాటర్లలో రఘువంశీ 1, ఆయుశ్ మాత్రే 7, హార్దిక్ తామోర్ 0, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 17, సూర్యకుమార్ యాదవ్ 0, శివమ్ దూబే 17, సూర్యాంశ్ షేడ్గే 44 పరుగులు చేసి ఔటయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment