Asghar Afghan Retirement: Interesting Unknown Facts In Telugu - Sakshi
Sakshi News home page

Asghar Afghan: 40 జట్లపై ఆడినవాడు.. అత్యధిక విజయాల కెప్టెన్‌..! 

Published Mon, Nov 1 2021 9:34 AM | Last Updated on Mon, Nov 1 2021 11:42 AM

Asghar Afghan Retirement Do You Know Interesting Facts About Him Telugu - Sakshi

Asghar Afghan Retirement: అస్గర్‌ అఫ్గాన్‌... జాతీయ జట్టుకు సుదీర్ఘ కాలం సేవలందించిన సీనియర్‌ ఆటగాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా అతను జట్టు భారాన్ని మోశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గాన్‌ తొలి అడుగులు పడుతున్న సమయంలో కీలక సభ్యుడిగా నిలిచిన అతను 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. 2004లో అఫ్గాన్‌ అండర్‌–17 సభ్యుడిగా సత్తా చాటిన అనంతరం అతను సీనియర్‌ స్థాయికి ఎదిగాడు.

అఫ్గాన్‌ తొలి ప్రధాన ఐసీసీ టోర్నీ అయిన 2010 టి20 ప్రపంచకప్‌లో సభ్యుడిగా ఉన్న అతను ఇప్పుడు టి20 ప్రపంచకప్‌తోనే ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఒక టెస్టు జట్టుపై అఫ్గాన్‌ తొలి విజయంలో (2014లో బంగ్లాదేశ్‌పై) కూడా అతనిది కీలక పాత్ర.బ్యాట్స్‌మన్‌గాకంటే కూడా అస్గర్‌ కెప్టెన్‌గా జట్టుపై తనదైన ముద్ర వేశాడు. ప్రతికూలతలను అధిగమించి అఫ్గానిస్తాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌పై తమదైన ముద్ర వేయడంలో అతని పాత్ర ఎంతో ఉంది.

అత్యధిక విజయాల కెప్టెన్‌
అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక విజయాల కెప్టెన్‌గా రికార్డు అతని పేరిటే ఉండటం విశేషం. 52 మ్యాచ్‌లలో జట్టుకు నాయకత్వం వహించిన అస్గర్‌ 42 మ్యాచ్‌లలో గెలిపించాడు. 114 వన్డేల్లో 2424 పరుగులు చేసిన అతను, 75 అంతర్జాతీయ టి20ల్లో 1382 పరుగులు సాధించాడు. అఫ్గాన్‌ తొలి టెస్టు (భారత్‌తో)కు కెప్టెన్‌న్‌గా ఉన్న అతను మొత్తం 6 టెస్టులు ఆడాడు.  

40 టీమ్‌లను ఎదుర్కొన్నాడు..
అఫ్గానిస్తాన్‌ జట్టు ఇన్నేళ్లలో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ లీగ్‌ – డివిజన్‌ 5 పోటీల స్థాయినుంచి నెమ్మదిగా పెద్ద టోర్నీలు ఆడే రెగ్యులర్‌ జట్టుగా ఎదిగింది. దాంతో అస్గర్‌కు పెద్ద సంఖ్యలో వేర్వేరు ప్రత్యర్థులతో ఆడే అవకాశం దక్కింది. అఫ్గాన్‌ జట్టు సభ్యుడిగా అస్గర్‌ ఏకంగా 40 టీమ్‌లను ఎదుర్కోవడం విశేషం. ఇందులో బహ్రెయిన్, కువైట్, టాంజానియా, ఇటలీ, అర్జెంటీనా, భూటాన్, జపాన్‌ తదితర టీమ్‌లు ఉండటం విశేషం!

ఇక టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా నమీబియాతో మ్యాచ్‌ సందర్భంగా రిటైర్‌మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు అస్గర్‌ అఫ్గాన్‌. ఈ సందర్భంగా అతడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీటి పర్యంతమవుతూ జట్టుతో జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. పాకిస్తాన్‌తో ఓటమి బాధించిందని... రిటైర్‌మెంట్‌ ప్రకటించేలా తనను పురిగొల్పిందని పేర్కొన్నాడు.

చదవండి:  T20 World Cup 2021 Ind Vs NZ: టోర్నీ నుంచి నిష్క్రమించినట్లేనా.. ఇంకా అవకాశం ఉందా?! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement