బ్రిస్బేన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో ఆతిధ్య ఆసీస్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఇంగ్లండ్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్(5 ఓవర్లు) కారణంగా 5 డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత పడటంతో పాటు జట్టు మ్యాచ్ ఫీజు మొత్తాన్ని(100 శాతం) కోల్పోయింది. ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ మ్యాచ్ అనంతరం ఈ మేరకు వెల్లడించాడు. మరోవైపు, ఇదే మ్యాచ్‌లో సూపర్ శతకంతో చెలరేగిన ఆసీస్ ఆల్‌రౌండర్ ట్రావిస్ హెడ్‌కు కూడా జరిమానా విధిస్తున్నట్లు రిఫరీ బూన్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను పరుష పదజాలంతో దూషించినందుకు గాను హెడ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపాడు.
ఇదిలా ఉంటే, ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టు మూకుమ్మడిగా రాణించింది. ఫలితంగా ఈ మ్యాచ్ కేవలం నాలుగు రోజుల్లోనే ముగిసింది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ నిర్ధేశించిన 20 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు వికెట్ కోల్పోయి చేధించింది. అంతకముందు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 220/2 స్కోరుతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట తొలి సెషన్‌లో తేలిపోయింది. 297 పరుగుల చేసి ఆలౌటైంది.
నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మలాన్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. ఆ జట్టు చివరి 74 పరుగుల చేసే క్రమంలో 8 వికెట్లు చేజార్చుకుంది. రూట్ 89 పరుగులు చేయగా.. మిగతా వారు ఆశించిన మేరకు రాణించలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో లియోన్ 4, కామెరాన్ గ్రీన్, కమిన్స్ చెరో రెండు వికెట్లు తీయగా.. స్టార్క్, హాజిల్‌వుడ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలగా.. ట్రావిస్ హెడ్(152 పరుగులు) శతక్కొటడంతో పాటు వార్నర్(94), లబుషేన్(74) రాణించడంతో ఆసీస్ 425 పరుగుల భారీ స్కోరు చేసింది.
చదవండి: సెంచరీల మోత మోగిస్తున్న రుతురాజ్ గైక్వాడ్
Comments
Please login to add a commentAdd a comment