న్యూఢిల్లీ: ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేని నటరాజన్‌ను సిడ్నీ టెస్టులో ఆడించడం సరైన నిర్ణయం కాదని వెటరన్ ఆటగాళ్ల అభిప్రాయం కాబోలు నవదీప్ సైనీకే బీసీసీఐ జై కొట్టింది. గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన మూడో టెస్టుకు నవదీప్ సైనీకి అవకాశం కల్పించింది. సిడ్నీ టెస్టుకు సంబంధించి తుది జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఇక గత మ్యాచ్‌లలో పెద్దగా ఆకట్టుకోని మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్‌ను తీసుకుంది. కాగా, గాయపడ్డ ఉమేష్ యాదవ్ స్థానంలో నటరాజన్‌ను తీసుకునేందుకు జట్టు యాజమాన్యం యోచించగా.. ఇండియన్ వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా వంటివారు పెదవి విరిచిన సంగతి తెలిసిందే. నటరాజన్ బదులు నవదీప్ సైనీని తుది జట్టులోకి తీసుకుని అరంగేట్రం చేయించాలని నెహ్రా మంగళవారం పీటీఐతో మాట్లాడుతూ అన్నాడు. లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడడంతోపాటు, సిడ్నీ ఫ్లాట్ వికెట్‌పై సైనీ ఎక్స్‌ట్రా పేస్ బౌలింగ్ టీమిండియాకు పనికొస్తుందని పేర్కొన్నాడు.
గాయపడిన మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, నటరాజన్ వచ్చారని, సైనీని నేరుగా తీసుకున్నారని గుర్తు చేశాడు. అందుకనే మూడో పేసర్‌గా తొలి ప్రాధాన్యం సైనీకే ఇవ్వాలని సూచించాడు. అతని తర్వాత స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, నటరాజన్ ఉంటారని నెహ్రా తెలిపాడు. ఇక మెల్‌బోర్న్ టెస్టులో అరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో ఆకట్టుకున్న మహ్మద్ సిరాజ్‌పై అతను ప్రశంసలు కురిపించాడు. తొలి మ్యాచ్‌లోనే ఎంతో అనుభవమున్న ఆటగాడిలా సిరాజ్ బౌలింగ్ చేశాడడని నెహ్రా కొనియాడాడు. కాగా, నెట్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన తమిళనాడు సేలంకు చెందిన టి.నటరాజన్ ఐపీఎల్ 2020లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి నిరూపించుకున్నాడు. యార్కర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకుని ఆస్ట్రేలియా పర్యటనలో టీ20, వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరుగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. ఇదిలాఉండగా.. తొలి టెస్టు తర్వాత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రాగా.. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ గాయాల బారిన పడి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment