శ్రీలంకతో మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్ శర్మ
Asia Cup 2022- Team India: ‘‘గతేడాది ప్రపంచకప్ టోర్నీలో మన జట్టు ఓడిపోయినపుడు చాలా మంది దానికి కారణం విరాట్ కోహ్లి అన్నారు. కెప్టెన్‌ను మార్చాలని మాట్లాడారు. మరి ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఆసియా కప్ గెలవలేకపోయాడు కదా’’ అని టీమిండియా మాజీ కెప్టెన్ ఆకాశ్ చోప్రా అన్నాడు. మెగా టోర్నీలో భారత్ చతికిల పడటానికి కెప్టెన్లు కారణం కాదని.. అసలు సమస్య జట్టు ఎంపికలోనే ఉందని అభిప్రాయపడ్డాడు.
కోహ్లి, రోహిత్ కారణం కాదు!
గతేడాది యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్-2021లో కోహ్లి సేన తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. కనీసం సెమీస్ కూడా చేరుకుండానే ఐసీసీ ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరు, కోహ్లి కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మెగా టోర్నీ ఆరంభానికి ముందు చెప్పినట్లుగానే విరాట్ కోహ్లి సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు.
చెత్త ప్రదర్శన
ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. హిట్‌మాన్ సారథ్యంలో భారత జట్టు టీ20 ఫార్మాట్‌లో అద్బుత విజయాలు సాధించింది. కానీ ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిల పడింది. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేన.. సూపర్-4లో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో వరుస పరాజయాలతో కనీసం ఫైనల్ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది.
ముఖ్యంగా టోర్నీకి ముందు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయపడటం.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేయకపోవడం.. అవకాశాలు అందుకున్న అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ వంటి యువ ఫాస్ట్ బౌలర్లు కీలక సమయాల్లో ఒత్తిడిని జయించలేక చేతులెత్తేయడం.. తుది జట్టు కూర్పులోనూ స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో భారత జట్టు భారీ మూల్యమే చెల్లించింది.
టీమిండియా ఓటమికి ప్రధాన కారణం అదే!
ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ షోలో మాట్లాడుతూ.. గతేడాది ప్రపంచకప్.. ఈసారి ఆసియా కప్‌లో భారత జట్టు ఓటమికి కెప్టెన్సీ కారణం కాదన్నాడు. జట్టు ఎంపికే ప్రధాన సమస్యగా మారిందని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా తుది జట్టు కూర్పు విషయంలో సరైన ప్రణాళిక లేకుండానే ముందుకు వెళ్లి చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. తరచూ జట్టులో మార్పులు చేయడం సరికాదని.. శ్రీలంక, పాకిస్తాన్ ఒకటీ రెండు మార్పులు మినహా ఒకే జట్టుతో ఆడి ఫైనల్‌కు చేరుకున్నాయని చెప్పుకొచ్చాడు.
చదవండి: 'కెప్టెన్ రిజ్వాన్ కాదు.. నేను'.. అంపైర్‌పై బాబర్ ఆజాం ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment