Asia Cup 2022 India Vs Pakistan- Virat Kohli: ఆసియాకప్-2022లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతోంది టీమిండియా. 2018లో వన్డే ఫార్మాట్‌లో జరిగిన టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు హిట్‌మ్యాన్ పూర్తి స్థాయిలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత టీ20 ఫార్మాట్‌లో ఈ మెగా ఈవెంట్‌లో ఆడనుంది. ఇక టీమిండియాతో పాటు దాయాది పాకిస్తాన్ సైతం గ్రూప్- ఏలోనే ఉంది.
ఈ క్రమంలో ఆసియా కప్ 15వ ఎడిషన్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాక్‌తోనే భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. పాకిస్తాన్‌కు కూడా ఇదే మ్యాచ్‌తో టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది. కాగా ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయి.
ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లోనూ పాక్‌తో పోరులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు టీ20లలో ఈ చిరకాల ప్రత్యర్థులు తొమ్మిదిసార్లు తలపడ్డాయి. 2007 నాటి వరల్డ్‌కప్ టోర్నీలో తొలిసారిగా.. ప్రపంచకప్-2021లో చివరిసారిగా ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో భారత్ ఏడుసార్లు గెలుపొందగా.. పాకిస్తాన్ రెండు విజయాలతో సరిపెట్టుకుంది.
బదులు తీర్చుకోవాలని!
అయితే, గతేడాది టీ20 ప్రపంచకప్‌లో మాత్రం టీమిండియా కనీవిని ఎరుగని రీతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇందుకు ఇప్పుడు బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. అందుకు తగ్గట్టుగానే టీమిండియా ప్రస్తుతం సీనియర్లు, జూనియర్లతో సమతౌల్యంగానూ.. పటిష్టంగానూ ఉంది.
ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ తదితరులు ఉండగా.. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో బెంచ్‌ను మరింత స్ట్రాంగ్‌గా తయారైంది. ఇక బౌలర్లలో చహల్, అర్ష్‌దీప్ సింగ్ ఉండనే ఉన్నారు.
కళ్లన్నీ కోహ్లిపైనే!
ఇక ఆసియా కప్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీ లిఖించుకున్న విరాట్ కోహ్లి ఈసారి ఎలా రాణిస్తాడన్న అంశం మీద చర్చ జరుగుతోంది. ఫామ్‌లేమి సమస్యను అధిగమించి బ్యాట్ ఝులిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. గతంలో ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఒకే ఒక మ్యాచ్‌లో ఒంటిచేత్తో కోహ్లి టీమిండియాను గెలిపించిన తీరును ప్రస్తావిస్తున్నారు.
నాడు 83 పరుగులకే ఆలౌట్..
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా 2016 నాటి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పాకిస్తాన్‌కు చుక్కలు చూపించారు. ఆశిష్ నెహ్రా, జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా దెబ్బకు పాక్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది.
ఓపెనర్లు మహ్మద్ హఫీజ్ 4, షార్జీల్ ఖాన్ 7 పరుగులకే అవుట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఖుర్రం మంజూర్ 10 పరుగులు(కోహ్లి రనౌట్ చేశాడు) సాధించి పెవిలియన్ చేరాడు. ఇక నాటి స్టార్ ప్లేయర్ షోయబ్ మాలిక్ సైతం 4 పరుగులతో నిరాశపరిచాడు.
ఇక సర్ఫరాజ్ 25 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు చేసిన స్కోర్లు వరుసగా 3,2,4,8,1,0. దీంతో 17.3 ఓవర్లలో షాహిద్ ఆఫ్రిది బృందం 83 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
ఓపెనర్లు డకౌట్.. మిగతా వాళ్లంతా విఫలం.. ఒకే ఒక్కడు
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్‌ల ఆదిలోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఓపెనర్లు అజింక్య రహానే, రోహిత్ శర్మను డకౌట్ చేశాడు.
దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి.. సింగిల్స్ తీస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 49 పరుగులు సాధించాడు. హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉండగా సమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఆ తర్వాత సురేశ్ రైనా 1, యువరాజ్ సింగ్ 14(నాటౌట్), హార్దిక్ పాండ్యా 0, ధోని 7 పరుగులు(నాటౌట్) చేశారు. ఈ క్రమంలో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా 15.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ధోని సేన 85 పరుగులు సాధించింది. తద్వారా పాక్‌పై గెలుపు నమోదు చేసింది. కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇక టీ20 ప్రపంచకప్-2021లోనూ పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లి రాణించిన విషయం తెలిసిందే. మిగతా వాళ్లంతా విఫలమైనా నాటి ఈ కెప్టెన్ 57 పరుగులు చేశాడు. దీంతో పాక్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా కోహ్లి చెలరేగుతాడని.. సెంటిమెంట్ రిపీట్ చేస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
చదవండి: Ind Vs Pak: కోహ్లికి గంగూలీ పరోక్ష హెచ్చరిక?! సెంచరీ చేయాలని ఆశిస్తున్నా.. కానీ ఇప్పుడు కష్టమే!
Asia Cup 2022: భారత్‌తో తొలి మ్యాచ్.. పాకిస్తాన్ సీనియర్ పేసర్ రీ ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment