Asia Cup 2022: IND VS PAK Match Becomes Most Watched Match Ever On Digital - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: రికార్డులు తిరగరాసిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్

Published Mon, Aug 29 2022 8:06 PM | Last Updated on Mon, Aug 29 2022 8:26 PM

Asia Cup 2022: IND VS PAK Match Becomes Most Watched Match Ever On Digital - Sakshi

IND VS PAK: ఆసియా కప్‌ 2022లో భాగంగా నిన్న జరిగిన దాయాదుల సమరం ప్రేక్షకులకు అసలుసిసలైన క్రికెట్‌ మజాను అందించడంతో పాటు వ్యూయర్షిప్‌ పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో (డిస్నీ హాట్‌ స్టార్‌) ఈ మ్యాచ్‌ను కోటి మందికి పైగా (13 మిలియన్లు) వీక్షించినట్లు సమాచారం. డిస్నీ హాట్ స్టార్‌ చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యూయర్షిప్‌ సాధించిన మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌ డిజిటల్ ప్లాట్‌ఫాంలో అత్యధికంగా వీక్షించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌గా కూడా నిలిచింది.

ఓటీటీలో ఇప్పటివరకు అత్యధిక వ్యూయర్షిప్‌ సాధించిన మ్యాచ్‌ రికార్డు ఐపీఎల్‌ మ్యాచ్‌ పేరిట ఉంది. 2019 ఐపీఎల్‌ ఫైనల్లో ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 18 మిలియన్ల మంది వీక్షించారు. ఓటీటీ చరిత్రలో ఇదే అత్యధికం. ఆ తర్వాతి స్థానం కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ పేరిటే ఉండింది. అదే సీజన్‌లో ఆర్సీబీ-ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌కు 12 మిలియన్ల వ్యూయర్షిప్ లభించింది. తాజాగా జరిగిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఈ రికార్డును బద్దలు కొట్టిందని తెలుస్తోంది.  

ఇదిలా ఉంటే, నిన్న (ఆగస్ట్‌ 28) పాక్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో భారత్‌..దాయాదిపై పూర్తి ఆధిపత్యం చలాయించి విజేతగా నిలిచింది. హార్ధిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించగా.. భువీ, కోహ్లి, జడేజాలు జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టీమిండియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.   
చదవండి: పాక్‌ ఓటమికి అది కూడా ఒక కారణమే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement