
విరాట్ కోహ్లి(PC: BCCI)
గడ్డు పరిస్థితులు.. స్పందించిన కోహ్లి! నాకిది అసలు సమస్యే కాదు!
Asia Cup 2022- India Vs Pakistan- Virat Kohli: ‘‘నా ఆట ఎలా ఉందో నాకు తెలుసు.. అయినా.. అంతర్జాతీయ క్రికెట్‌లో వైవిధ్యమైన బంతులతో ఇబ్బంది పెట్టే ఎంతో మంది బౌలర్లు.. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటేనే ఇక్కడిదాకా రాగలము.. ప్రస్తుత గడ్డు దశను నేను సులువుగానే దాటగలను’’ అని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు.
గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కోహ్లి.. ఇంగ్లండ్ పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. ఆసియా కప్-2022 ఆరంభం నేపథ్యంలో తిరిగి జట్టుతో చేరాడు. ఇక ఆగష్టు 28 నాటి భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగా వేచిచూస్తున్నారో.. చిరకాల ప్రత్యర్థిపై కోహ్లి బ్యాట్ ఝులిపించి ఫామ్‌లోకి వస్తాడా? లేదా? అని అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ దశను సులువుగానే అధిగమిస్తా!
ఈ నేపథ్యంలో క్రీడా వర్గాల్లో ఎక్కడ చూసినా కోహ్లి ఆట గురించే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన కోహ్లి తన ఆట తీరుపై తొలిసారిగా స్పందించాడు. కఠిన పరిస్థితులను, సమస్యలను ఎలా అధిగమించాలో తనకు తెలుసన్నాడు. ఈ సందర్భంగా 2014 నాటి ఇంగ్లండ్ పర్యటన గురించి కోహ్లి ప్రస్తావించాడు.
నా అనుభవాలు విలువైనవి!
‘‘ఇంగ్లండ్ టూర్‌లో జరిగిన తప్పిదాల గురించి నేను తెలుసుకున్నాను. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని దానిని సరిదిద్దుకున్నాను. నిజానికి ఇప్పుడు కూడా నేను బాగానే బ్యాటింగ్ చేస్తున్నాను. ఒక్కసారి తిరిగి రిథమ్‌లోకి వస్తే కచ్చితంగా ఇంకా మెరుగ్గా ఆడగలను. కాబట్టి నాకిది ఇప్పుడు అసలు సమస్యే కాదు.
ప్రతి ఒక్కరి కెరీర్‌లో ఎత్తుపళ్లాలు సహజం. ఓ ఆటగాడిగా.. వ్యక్తిగా నేనూ అందుకు అతీతం కాదు. అయితే, ఈ గడ్డు దశ నన్ను భయపెట్టలేదు. నా అనుభవాలు ఎంతో విలువైనవి. అవి నాకెంతో నేర్పించాయి.. నేర్పిస్తున్నాయి కూడా! కచ్చితంగా ఈ దశను నేను సులువుగానే అధిగమిస్తాను’’ అని కోహ్లి విశ్వాసం వ్యక్తం చేశాడు.
చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్ కీలక నిర్ణయం!
Asia Cup 2022: ఆసియాకప్ విజేత ఎవరో చెప్పేసిన షేన్ వాట్సన్