
Asia Cup 2023 India Squad: ‘‘మేం ఇప్పుడు 18 మందిని ఎంపిక చేశాం. ఈ జాబితా నుంచే వరల్డ్ కప్ టీమ్‌ను ఎంచుకోవడం ఖాయం. ఎంపికకు ముందు మన జట్టు ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. అన్నీ చూశాకే నిర్ణయం తీసుకుంటాం. రాహుల్ రెండో మ్యాచ్ వరకు పూర్తిగా కోలుకోగలడని ఆశిస్తున్నాం.
రెండో మణికట్టు స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోవడంతో యుజువేంద్ర చహల్‌ను పక్కన పెట్టాం. వెస్టిండీస్‌లో తిలక్ ఆట మమ్మల్ని ఆకట్టుకుంది. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే వన్డేల్లో తీసుకున్నాం. ఎడంచేతివాటం కూడా అదనపు అర్హత’’ అని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఆసియా వన్డే కప్-2023 టోర్నీకి జట్టును ప్రకటించిన సందర్భంగా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్‌కప్ జట్టులోనూ వీళ్ల నుంచే!
ఈ ఈవెంట్‌లో ఆడే ఆటగాళ్ల నుంచే సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్-2023కి కూడా జట్టును ఎంపిక చేస్తామని అగార్కర్ స్పష్టం చేశాడు. కాగా ఆసియా కప్ నేపథ్యంలో జట్టుకు చాన్నాళ్లుగా దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.
అదే విధంగా వెస్టిండీస్‌లో సత్తా చాటిన తెలుగు తేజం తిలక్ వర్మను అదృష్టం వరించింది. ఏకంగా ఆసియా కప్ వంటి మెగా టోర్నీతో వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం అతడి ముంగిట నిలిచింది.
తిలక్‌కు లక్కీ చాన్స్...
హైదరాబాద్‌కు చెందిన నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ఇటీవల వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 173 పరుగులతో భారత్ తరఫున టాపర్‌గా నిలిచాడు. అయితే అతని స్కోర్లకంటే క్రీజ్‌లో అతని ఆత్మవిశ్వాసం, పోరాటతత్వం అందరినీ ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పటి వరకు వన్డేలే ఆడకపోయినా అతనికి అవకాశం దక్కింది.
దేశవాళీ వన్డేల్లో తిలక్ రికార్డు చాలా బాగుంది. 25 మ్యాచ్‌లలో 56.18 సగటుతో అతను 1,236 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉండగా స్ట్రయిక్‌రేట్ కూడా 101.64 కావడం అతని దూకుడును చూపిస్తోంది.
ఆసియా వన్డే కప్-2023కి బీసీసీఐ ప్రకటించిన జట్టు:
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.
స్టాండ్ బై: సంజూ శాంసన్
Comments
Please login to add a commentAdd a comment