Ind vs SL: అభిమానులకు చేదువార్త! లం‍కను తక్కువ అంచనా వేస్తే అంతే ఇక! | Asia Cup 2023 Final Ind Vs SL Probable XIs Pitch Report Weather Forecast | Sakshi
Sakshi News home page

Asia Cup: అభిమానులకు చేదువార్త.. ఫైనల్‌కు వర్షం ముప్పు! లంకను తక్కువ అంచనా వేస్తే అంతే ఇక.. టాస్‌ గెలిస్తే మాత్రం..

Published Sun, Sep 17 2023 8:57 AM | Last Updated on Sun, Sep 17 2023 11:26 AM

Asia Cup 2023 Final Ind Vs SL Probable XIs Pitch Report Weather Forecast - Sakshi

Asia Cup, 2023- India vs Sri Lanka, Final Predicted Playing XI: గతేడాది ఆసియా కప్‌ టీ20 ఫార్మాట్‌లో సూపర్‌-4 దశలోనే ఇంటిబాట పట్టిన టీమిండియా వన్డే ఫార్మాట్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్‌-2023 ఆరంభానికి ముందే అంతర్జాతీయ టైటిల్‌ గెలిచి అభిమానులను ఖుషీ చేయాలని రోహిత్‌ సేన భావిస్తోంది.

ఈ క్రమంలో కొలంబో వేదికగా శ్రీలంకతో ఆసియా కప్‌-2023 ఫైనల్‌కు అన్ని రకాలుగా సిద్ధమైంది. సూపర్‌-4లో ఆఖరిదైన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఐదు మార్పులతో బరిలోకి దిగిన భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో చేదు అనుభవం
విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చిన మేనేజ్‌మెంట్‌.. తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, శార్దూల్‌ ఠాకూర్‌,  ప్రసిద్‌ కృష్ణను ఆడించారు.

అయితే, వెస్టిండీస్‌తో టీ20లలో అదరగొట్టినప్పటికీ.. వన్డే అరంగేట్రంలో తడబడ్డాడు హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ. సూర్య కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక బుమ్రా ఉన్నాడు కాబట్టి తుదిజట్టు నుంచి మరోసారి షమీకి ఉద్వాసన తప్పదు.

వాషింగ్టన్‌ సుందర్‌కు ఛాన్స్‌!
సిరాజ్‌ రాకతో ప్రసిద్‌ తప్పుకోవాల్సిందే. కానీ బంగ్లాతో మ్యాచ్‌ సందర్భంగా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ దూరం కావడంతో ఇప్పటికే వాషింగ్టన్‌ సుందర్‌ శ్రీలంకకు చేరుకున్నాడు. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ను తప్పించి ఈ చెన్నై కుర్రాడిని ఆడించవచ్చు.  

లంక స్పిన్నర్‌ దూరం.. తక్కువ అంచనా వేస్తే అంతే ఇక
టీమిండియా పరిస్థితి ఇలా ఉంటే.. కీలక స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ దూరం కావడం శ్రీలంక అవకాశాలపై ప్రభావం చూపే ఛాన్స్‌ ఉంది. అయితే, యువ స్పిన్‌ సంచలనం దునిత్‌ వెల్లలగే సూపర్‌ఫామ్‌లో ఉండటం.. అతడికి తోడుగా ఆల్‌రౌండర్లు అసలంక, ధనంజయ డి సిల్వా రాణించడం దసున్‌ షనక బృందానికి సానుకూలాంశాలు.

కుశాల్‌ మెండిస్‌, నిసాంక, సమరవిక్రమ బ్యాట్‌ ఝలిపిస్తే తిరుగే ఉండదు. ఇక స్టార్లు లేకపోయిన్పటికీ ఫైనల్‌ దాకా చేరుకున్న.. డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంకను టీమిండియా లైట్‌ తీసుకునే పరిస్థితి లేదు. సూపర్‌-4 మ్యాచ్‌లోనే రోహిత్‌ సేనకు ఈ విషయం బాగా అర్థమైంది. 

టాస్‌ గెలిచిన జట్టు తొలుత..
ఇక కొలంబో వాతావరణం మరోసారి టీమిండియా- శ్రీలంక ఫైనల్‌ మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుత ఆసియా కప్‌లో కొలంబో వేదికగా జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జట్టు ఐదుసార్లు గెలవడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌ ఇప్పటి వరకు 15 సార్లు జరిగింది. 13 సార్లు వన్డే ఫార్మాట్‌లో, రెండుసార్లు టి20 ఫార్మాట్‌లో నిర్వహించారు. భారత్, శ్రీలంక జట్లు ఆసియా కప్‌ ఫైనల్స్‌లో ఏడుసార్లు తలపడ్డాయి. నాలుగుసార్లు భారత్, మూడుసార్లు శ్రీలంక గెలుపొందాయి.

ఓవరాల్‌గా ఆసియా కప్‌ టైటిల్‌ను అత్యధికంగా భారత్‌ ఏడుసార్లు గెలవగా.. ఆరుసార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది శ్రీలంక. మరి ఈసారి ఎవరిది పైచేయి కానుందో! 

పిచ్, వాతావరణం 
గత తొమ్మిది రోజుల్లో ప్రేమదాస స్టేడియంలో ఆరు మ్యాచ్‌లు జరిగాయి. దాంతో పిచ్‌ మందకొడిగా మారింది. స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలంగా ఉండే అవకాశముంది. ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది.

ఆదివారం సాయంత్రం, రాత్రి వేళల్లో ఒకట్రెండుసార్లు ఉరుములతో కూడిన వర్షం పడవచ్చు. ఒకవేళ వర్షంవల్ల ఆట సాధ్యపడకపోతే రిజర్వ్‌ డే సోమవారం ఫైనల్‌ను కొనసాగిస్తారు.  

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్, కేఎల్‌ రాహుల్, విరాట్‌ కోహ్లి, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌/వాషింగ్టన్‌ సుందర్, కుల్దీప్‌ యాదవ్, బుమ్రా, సిరాజ్‌. 

శ్రీలంక: షనక (కెప్టెన్‌), కుశాల్‌ పెరీరా, నిసాంక, కుశాల్‌ మెండిస్, సమరవిక్రమ, అసలంక, ధనంజయ డిసిల్వా, దునిత్‌ వెల్లలగే, దుషాన్‌ హేమంత, పతిరణ, కసున్‌ రజిత. 

చదవండి: న్యూజిలాండ్‌పై గెలుపు.. ఇంగ్లండ్‌దే సిరీస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement