భారత్-పాక్ సూపర్-4 మ్యాచ్ రద్దు
ఇవాళ జరగాల్సిన భారత్-పాక్ సూపర్ 4 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే (సెప్టెంబర్ 11, రేపు) ఉండటంతో మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ పూర్తి 50 ఓవర్ల మ్యాచ్‌గా సాగనుంది. అయితే, వరుణుడు రేపు కూడా ఆటకు ఆటంకం కలిగించవచ్చని కొలొంబో వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి రాత్రికిరాత్రి పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వస్తాయేమో వేచి చూడాలి. వర్షం కారణంగా ఇవాల్టి ముగిసే సమయానికి భారత్ స్కోర్ 24.1 ఓవర్లలో 147/2గా ఉంది. రోహిత్ (56), గిల్ (58) ఔట్ కాగా.. కోహ్లి (8), రాహుల్ (17) క్రీజ్‌లో ఉన్నారు.
నిలిచిపోయిన వర్షం.. 7:30 గంటలకు గ్రౌండ్‌ను పరిశీలించనున్న అంపైర్లు
సాయంత్రం 4:53 గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రి 7 గంటల సమయంలో కాస్త ఎడతెరిపినిచ్చినప్పటికీ మైదానం మొత్తం చిత్తడిగా ఉండటంతో రాత్రి 7:30 గంటలకు మైదానాన్ని పరిశీలించాలని అంపైర్లు నిర్ణయించారు.
ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం లేకుండా డక్‌వర్త్ లూయిస్ పద్థతి ప్రకారం పాక్‌కు టార్గెట్ నిర్ధేశించాల్సి వస్తే పరిస్థితి ఇలా ఉంటుంది. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరగాలంటే కటాఫ్ టైమ్ రాత్రి 10:30 గంటలు. దీని తర్వాత మ్యాచ్ సాధ్యపడే అవకాశం లేదు. మ్యాచ్ రిజర్వ్ డే అయిన రేపు (సెప్టెంబర్ 11) నిర్వహించాల్సి ఉంటుంది.
భారత్ తిరిగి బ్యాటింగ్‌కు దిగకుండా 20 ఓవర్ల మ్యాచ్ అయితే (DLS ప్రకారం) పాక్ లక్ష్యం 181 పరుగులుగా ఉంటుంది.
21 ఓవర్లలో పాక్ లక్ష్యం 187
22 ఓవర్లలో 194
23 ఓవర్లలో 200
24 ఓవర్లలో 206
బ్యాడ్ న్యూస్.. భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం
24.1 ఓవర్ల తర్వాత భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఒక్కసారిగా భారీ వర్షం మొదలుకావడంతో స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పారు. ఈ సమయానికి భారత్ స్కోర్ 147/2గా ఉంది. రోహిత్ (56), గిల్ (58) ఔట్ కాగా.. విరాట్ కోహ్లి (8), కేఎల్ రాహుల్ (17) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది. షాదాబ్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది.
టీమిండియా రెండో వికెట్ డౌన్
123 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో అఘా సల్మాన్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి గిల్ (58) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 124/2. కోహ్లి (2), కేఎల్ రాహుల్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్
121 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ (56) ఔటయ్యాడు. షాదాబ్ బౌలింగ్‌లో ఫహీమ్ అష్రాఫ్‌కు క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 122/1. గిల్ (58), కోహ్లి (1) క్రీజ్‌లో ఉన్నారు.
సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన హిట్‌మ్యాన్
షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో హిట్‌మ్యాన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రోహిత్ 46 బంతుల్లో 4 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో 55 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా గిల్ (54) క్రీజ్‌లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 115/0.
గిల్ హాఫ్ సెంచరీ.. గేర్ మార్చిన రోహిత్
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడుతున్న శుభ్‌మన్ గిల్ 37 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో పక్క ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన రోహిత్ శర్మ ఇప్పుడిప్పుడే గేర్ మారుస్తున్నాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో రోహిత్ వరుసగా 2 సిక్సర్లు ఓ బౌండరీ బాదాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 96/0గా ఉంది. రోహిత్ (41 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), గిల్ (38 బంతుల్లో 50; 10 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు.
పాక్‌తో మ్యాచ్.. దూకుడుగా ఆడుతున్న భారత్
టాస్ ఓడి పాక్ ఆహ్వనం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ దూకుడుగా ఆడుతుంది. కెప్టెన్ రోహిత్ (17 బంతుల్లో 10; ఫోర్, సిక్స్) తన సహజశైలికి భిన్నంగా ఆచితూచి ఆడుతుంటే.. శుభ్‌మన్ గిల్ (13 బంతుల్లో 25; 6 ఫోర్లు) రెచ్చిపోతున్నాడు. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 37/0గా ఉంది.
ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రీ ఎంట్రీ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ స్ధానంలో రాహుల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు బుమ్రా కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.
తుది జట్లు
పాకిస్తాన్: ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, ఫాహీమ్ ఆష్రప్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్.
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment