
హాంకాంగ్‌పై 7 వికెట్లతో విజయం
నేడు ఒమన్‌తో పాకిస్తాన్ ‘ఢీ’
రాత్రి గం. 8 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో...
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీని బంగ్లాదేశ్ సునాయాస విజయంతో మొదలుపెట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన బంగ్లా 7 వికెట్ల తేడాతో హాంకాంగ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించి గెలిచింది. తమ తొలి పోరులో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన హాంకాంగ్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.
ఓపెనర్ అన్షుమన్ రథ్ (4) తొందరగానే వెనుదిరిగినా... మరో ఓపెనర్ జీషాన్ అలీ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి షాట్లతో హాంకాంగ్‌కు తగిన ఆరంభాన్ని అందించాడు. సీనియర్ బ్యాటర్ బాబర్ హయత్ (14) విఫలం కాగా, నిజాకత్ ఖాన్ (40 బంతుల్లో 42; 2 ఫోర్లు, 1 సిక్స్) పట్టుదలగా క్రీజ్‌లో నిలిచి పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తాను ఆడిన 32వ బంతికి గానీ అతను తన తొలి బౌండరీ కొట్టలేకపోయాడు!
చివర్లో కెప్టెన్ యాసిమ్ ముర్తజా (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు హాంకాంగ్‌కు చెప్పుకోదగ్గ స్కోరును అందించింది. బంగ్లా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా 3–13 మధ్య ఆడిన 11 ఓవర్లలో ఒక్క ఓవర్లో మాత్రమే హాంకాంగ్ రెండంకెల స్కోరు చేయగలిగింది. అయితే ఆఖరి 6 ఓవర్లలో 54 పరుగులు రాబట్టడంతో హాంకాంగ్ గౌరవప్రదంగా ముగించగలిగింది.
తన్‌జీమ్, తస్కీన్, రిషాద్ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఓపెనర్లు పర్వేజ్ (19), తన్‌జీద్ (14) ఎక్కువ సేపు నిలబడకపోయినా... కెపె్టన్ లిటన్ దాస్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్), తౌహీద్ (36 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్) భాగస్వామ్యంతో బంగ్లా సునాయాస విజయాన్ని అందుకుంది. వీరిద్దరు మూడో వికెట్‌కు 70 బంతుల్లో 95 పరుగులు జోడించారు. నేడు దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో ఒమన్ జట్టుతో పాకిస్తాన్ ఆడుతుంది.