
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో శ్రీలంక వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్-బిలో ఉన్న లంక జట్టు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అయితే, రెండో మ్యాచ్‌లో భాగంగా పసికూన హాంకాంగ్‌తో తలపడిన శ్రీలంక (SL vs HK).. గెలుపు కోసం ఆపసోపాలు పడింది.
దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగుల మేర మెరుగైన స్కోరు సాధించింది.
నిజాకత్ ఖాన్ మెరుపులు
ఓపెనర్లు జీషన్ అలీ (23), అన్షుమాన్ రథ్ (48) శుభారంభం అందించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ నిజాకత్ ఖాన్ అజేయ మెరుపు అర్ధ శతకం (38 బంతుల్లో 52)తో అలరించాడు. అయితే, హాంకాంగ్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంక గట్టిగానే శ్రమించాల్సి వచ్చింది.
హాంకాంగ్ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ కుశాల్ మెండిస్ 11, కమిల్ మిశారా 19, కుశాల్ పెరీరా 20 పరుగులు చేయగా.. కెప్టెన్ చరిత్ అసలంక (2), కమిందు మెండిస్ (5) పూర్తిగా విఫలమయ్యారు.
పాతుమ్ నిసాంక హాఫ్ సెంచరీ
అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. నిసాంక అర్ధ శతకానికి తోడు ఆఖర్లో వనిందు హసరంగ (9 బంతుల్లో 29 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో లంక గట్టెక్కగలిగింది.
శ్రీలంక తొలి ప్లేయర్‌గా..
ఇక శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన పాతుమ్ నిసాంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతేకాదు ఈ మ్యాచ్ సందర్భంగా నిసాంక ఓ అరుదైన రికార్డు కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో శ్రీలంక తరఫున అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
కాగా అంతకు ముందు ఈ రికార్డు కుశాల్ మెండిస్ పేరిట ఉండేది. అతడి ఖాతాలో 16 ఫిఫ్టీ ప్లస్ టీ20 స్కోర్లు ఉండగా.. నిసాంక (17) అతడిని అధిగమించాడు. ఇదిలా ఉంటే కుశాల్ పెరీరా కూడా 16సార్లు యాభైకి పైగా స్కోర్లు సాధించి కుశాల్ మెండిస్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
శ్రీలంక వర్సెస్ హాంకాంగ్ స్కోర్లు
👉హాంకాంగ్:149/4 (20)
👉శ్రీలంక: 153/6 (18.5)
👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో హాంకాంగ్‌పై శ్రీలంక గెలుపు.
చదవండి: ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే!