
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత్ ఏ జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 16) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏ బ్యాటర్లు పైచేయి సాధించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.
యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (114 బంతుల్లో 109; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. మరో ఓపెనర్ క్యాంప్‌బెల్ కెల్లావే (97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.
వన్, టు డౌన్ బ్యాటర్లు నాథన్ మెక్‌స్వీని (1), ఒలివర్ పీక్ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచినా.. ఆతర్వాత వచ్చిన కూపర్ కన్నోల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, సిక్స్) సత్తా చాటాడు. ఆట ముగిసే సమయానికి లియామ్ స్కాట్ 47, జోష్ ఫిలిప్ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
టీ విరామం వరకు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన భారత బౌలర్లు.. ఆతర్వాత 26 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై పట్టు సాధించేలా కనిపించారు. అయితే ఈసారి కూపర్ కన్నోల్లీ-లియామ్ స్కాట్ భారత్ పైచేయి సాధించకుండా అడ్డు తగిలారు.
వీరిద్దరు ఐదో వికెట్‌కు 109 పరుగులు జోడించి ఆసీస్‌ను పటిష్ట స్థితికి చేర్చారు. కన్నోల్లీ ఔటైనా లియామ్ స్కాట్ బాధ్యతగా ఆడుతూ ఆసీస్‌ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. అంతకుముందు కొన్‌స్టాస్-కెల్లావే జోడీ తొలి వికెట్‌కు 198 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసింది.
గుర్నూర్ బ్రార్ భారత్‌కు తొలి బ్రేక్ అందించారు. కెల్లావేను ఔట్ చేశాడు. అనంతరం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే ఒక్కసారిగా చెలరేగాడు. స్వల్ప వ్యవధిలో కెప్టెన్ మెక్‌స్వీనిని, సెంచరీ హీరో కొన్‌స్టాస్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత ఖలీల్ అహ్మద్ ఒలివర్ పీక్‌ను ఔట్ చేశాడు.
అనంతరం కన్నోల్లీ, లియామ్ స్కాట్ భారత బౌలర్ల సహనాన్ని చాలాసేపు పరీక్షించారు. 333 పరుగుల వద్ద హర్ష్ భారత్‌కు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న కన్నోల్లీని బోల్తా కొట్టించాడు.
కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు (నాలుగు రోజుల మ్యాచ్‌లు), మూడు అనధికారిక వన్డేల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళే తొలి టెస్ట్ మొదలైంది. రెండో టెస్ట్ కూడా ఎకానా స్టేడియంలోనే సెప్టెంబర్ 23-26 మధ్యలో జరుగతుంది. ఆతర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్‌లో వన్డేలు జరుగుతాయి.