
టీమిండియా స్టార్ శివం దూబే (Shivam Dube)ను ఉద్దేశించి బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morney Morkel) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో అతడి సేవలను పూర్తిగా వినియోగించుకుంటామని తెలిపాడు. ఈ టీ20 టోర్నీలో శివంను పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా ఉపయోగించుకుంటామని పేర్కొన్నాడు.
ఎనిమిది జట్ల మధ్య పోటీ
కాగా యూఏఈ వేదికగా భారత్ ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పాల్గొంటుండగా.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ తలపడుతున్నాయి.
రెండు నైపుణ్యాలపై దృష్టి ఉండాలి
ఇక అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో మంగళవారం (సెప్టెంబరు 9) ఈ టోర్నీ మొదలుకానుండగా.. బుధవారం టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను యూఏఈతో ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.
ఈ సందర్భంగా.. ‘‘నాలుగు ఓవర్లు బౌల్ చేసే ఆటగాడిగా శివంను మేము ఉపయోగించుకుంటాము. నా దృష్టిలో ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఆల్‌రౌండర్లు బ్యాటర్, బౌలర్‌గా తమకున్న రెండు నైపుణ్యాలపై దృష్టి సారించాలని నేను ఎల్లప్పుడూ చెబుతూ ఉంటా.
ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి
కొంతమంది ప్రాక్టీస్ సమయంలో ఏదో ఒక దానిపై మాత్రమే ఫోకస్ చేస్తారు. కానీ మేము మాత్రం వారు రెండు విధాలుగా రాణించాలని కోరుకుంటాము. ఇక.. మ్యాచ్ రోజున అందరి కంటే అతడికే పరిస్థితులు ఎక్కువగా అనుకూలించవచ్చు. కాబట్టి అందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని చెప్తాము’’ అని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు.
ఆల్‌రౌండర్లు మెరుగ్గా రాణిస్తే కెప్టెన్‌కు పని సులువు అవుతుందన్న మోర్నీ.. ఫ్రంట్‌లైన్ బౌలర్లతో పాటు ఆల్‌రౌండర్ల సేవలు కూడా బౌలింగ్ విభాగంలో ఉపయోగించుకుంటామని మరోసారి స్పష్టం చేశాడు. కాగా ఆసియా కప్ టోర్నీలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు కీలక ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు.
ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియా
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
చదవండి: ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్ కెప్టెన్.. సూర్య, రషీద్ ఖాన్ ఏం చేశారంటే?