Asia Cup 2023- India vs Sri Lanka: ‘‘అసలు మీరేం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసిందంటూ నాకు మీమ్స్‌తో కూడిన మెసేజ్‌లు వచ్చిపడుతున్నాయి. పాకిస్తాన్‌ను రేసు నుంచి తప్పించేందుకు టీమిండియా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోతుందనేది వాటి సారాంశం.
మీరంతా బాగానే ఉన్నారు కదా? అసలు ఇలా మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? శ్రీలంక బౌలర్లు శక్తిని కూడదీసుకుని ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. వెల్లలలగే, అసలంక కఠినంగా శ్రమించారు.
20 ఏళ్ల పిల్లాడి పట్టుదల చూశారా?
ఆ 20 ఏళ్ల పిల్లాడి తాపత్రయాన్ని మీరు చూశారా? 43 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇదంతా చూస్తూ ఉన్నా.. ఇండియా నుంచి, ఇతర దేశాల అభిమానుల నుంచి నాకు ఒకటే ఫోన్ కాల్స్. ఈరోజు ఇండియా కావాలనే ఓడిపోతుందని ఒకటే వాగడం’’ అంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే పోరాటం చూసిన తర్వాత కూడా ఇలా ఎలా మాట్లాడగలిగారో అర్థం కావడం లేదంటూ సోకాల్డ్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో పాకిస్తాన్‌ను 228 పరుగులతో చిత్తు చేసిన భారత జట్టు.. మంగళవారం శ్రీలంకతో తలపడింది.
తిప్పేసిన స్పిన్నర్లు
ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కొలంబోలో రోహిత్ సేన ఎలాంటి పొరపాటు చేయలేదు. పాక్‌తో మ్యాచ్ ముగిసిన 15 గంటల్లోపే మళ్లీ మైదానంలో దిగిన టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో లంక స్పిన్నర్లు వెల్లలగే, చరిత్ అసలంక ధాటికి 213 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై వెల్లలగే బంతిని తిప్పేసి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు.
టీమిండియా- లంక ఫలితంపై
అయితే, లక్ష్య ఛేదనలో లంక 172 పరుగులకే ఆలౌట్ కావడంతో అతడి పోరాటం వృథాగా పోయింది. 41 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా నేరుగా ఫైనల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. గ్రూప్-ఏలో భారత జట్టుతో పాటు ఉన్న పాకిస్తాన్‌కు ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. లంకను రోహిత్ సేన ఓడించాల్సిందే!
ఈ నేపథ్యంలోనే కొంతమంది టీమిండియా టాపార్డర్ విఫలం కావడం చూసి.. లంకను గెలిపించి పాక్‌ను రేసు నుంచి తప్పించేందుకు ఇలా ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఇదే విషయమై తనకు కాల్స్ వచ్చాయని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా తెలిపాడు.
వాళ్లంతా కష్టపడ్డారు.. మనోళ్లకు చేతకాదు
‘‘వాళ్లు ఎందుకు అలా అంటున్నారో అర్థం కాలేదు. అసలు టీమిండియా ఎందుకు ఓడిపోవాలని అనుకుంటుంది? గెలిస్తే ఎంచక్కా ఫైనల్ చేరే అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటుంది? ఎలాంటి కారణాలు లేకుండా ఇలాంటి పిచ్చిపని ఎందుకు చేయాలనుకుంటుంది?
లో స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పట్టుదలగా పోరాడారు. కుల్దీప్ అద్భుతం చేశాడు. జట్టును గెలిపించేందుకు జస్‌ప్రీత్ బుమ్రా శక్తిమేర కష్టపడ్డాడు. ఇక లంక కుర్రాడు వెల్లలగే బౌలింగ్, బ్యాటింగ్ రెండూ చేయగలడు. కానీ మన వాళ్ల సంగతి వేరు. వాళ్ల నుంచి ఇలాంటి పోరాటం ఎప్పుడూ చూడలేదు.
మన ఫాస్ట్‌బౌలర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, నసీం షా 10 ఓవర్లు బౌలింగ్ చేసినా గాయపడకుండా ఉంటే చూడాలని ఉంది. మన వాళ్లు కూడా పోరాటపటిమ కనబరచాలి’’ అని అక్తర్ వ్యాఖ్యానించాడు. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిస్తేనే ఫైనల్ బెర్తు ఖరారవుతుంది.
చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా!
5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే?
Super11 Asia Cup 2023 | Super 4 | India vs Sri Lanka | Highlightshttps://t.co/EI2KjpFup6#AsiaCup2023
— AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023
Comments
Please login to add a commentAdd a comment