Asia Cup 2023- Pakistan vs India: టీమిండియాతో మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హ్యారిస్ రవూఫ్ రిజర్వ్ డే బౌలింగ్‌కు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ధ్రువీకరించాడు.
కాగా ఆసియా కప్-2023లో భారత్- పాకిస్తాన్ తొలిసారి ఎదురుపడిన సందర్భంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైపోయింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని పల్లెకెల్లెలో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో దాయాదుల పోరు పూర్తి కాకుండానే అర్ధంతరంగా ముగిసిపోవడంతో చెరో పాయింట్ లభించింది.
మరోసారి వర్షం ఆటంకం
ఈ నేపథ్యంలో గ్రూప్-ఏలో అప్పటికే నేపాల్‌పై విజయంతో ఉన్న పాకిస్తాన్ సూపర్-4లో అడుగుపెట్టగా.. తమ రెండో మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తు చేసి రోహిత్ సేన సైతం అర్హత సాధించింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య ఆదివారం(సెప్టెంబరు 10) టీమిండియా- పాకిస్తాన్ మరోసారి పోటీపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బాబర్ ఆజం బృందం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ దిగిన భారత జట్టుకు ఓపెనర్లు.. కెప్టెన్ రోహిత్ రోహిత్ శర్మ(56), శుబ్‌మన్ గిల్(58) హాఫ్ సెంచరీలతో శుభారంభం అందించారు.
వాళ్లకు చెరో వికెట్
అయితే, కొలంబోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో రిజర్వ్ డే ఉన్న కారణంగా ఆదివారం ఆటను నిలిపివేశారు. అప్పటికి.. 24.1 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా మళ్లీ వరుణుడు అడ్డుపడటంతో ఆలస్యమైంది. ఇక సెప్టెంబరు 10న ఆట రద్దు చేసే సమయానికి పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది, ఆల్‌రౌండర్ షాబాద్ ఖాన్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
హ్యారిస్ రవూఫ్ అవుట్.. కారణమిదే
ఇక 5 ఓవర్ల బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చిన ఫాస్ట్‌బౌలర్ హ్యారిస్ రవూఫ్‌నకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఈ క్రమంలో రిజర్వ్ డే అయిన సోమవారం అతడు పూర్తిగా బౌలింగ్‌కు దూరంగా ఉండనున్నాడు.
వరల్డ్‌కప్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని
ఈ విషయం గురించి మోర్నీ మోర్కెల్ స్పందిస్తూ.. అజీర్తి, కడుపులో మంట కారణంగా రవూఫ్ పొట్ట కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అతడిని ఈ మ్యాచ్‌కు దూరం ఉంచుతున్నట్లు తెలిపాడు.
అదే సమయంలో ఇతర బౌలర్లను కూడా పరీక్షించే అవకాశం దొరుకుతుందని పాక్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో గత మ్యాచ్‌లో హ్యారిస్ రవూఫ్ మూడు వికెట్లతో రాణించాడు.
చదవండి: Asia Cup: కొలంబోలో ఎడతెగని వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం! ఇక..
Comments
Please login to add a commentAdd a comment