Photo Credit: ICC
అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టి20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఆసియాకప్‌లో మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయడం ద్వారా అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాతో మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రషీద్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు రషీద్ ఖాన్ 112 వికెట్లతో ఉన్నాడు.
ముష్ఫికర్ రహీమ్, అఫిప్ హొస్సేన్, మహ్మదుల్లా రూపంలో మూడు వికెట్లతో.. మొత్తంగా 68 మ్యాచ్‌ల్లో 115 వికెట్లు సాధించి న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీని(114 వికెట్లు) అధిగమించాడు. కాగా రషీద్ కంటే ముందు బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 122 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
రెండు విజయాలతో అఫ్గానిస్తాన్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. గురువారం శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ‘సూపర్–4’ రెండో బెర్త్ ఖరారవుతుంది. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 127 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముజీబ్ వుర్ రహ్మాన్ (3/16), రషీద్ ఖాన్ (3/22) తిప్పేశారు. ముసాదిక్ (31 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
అనంతరం అఫ్గానిస్తాన్ 13 ఓవర్లలో 3 వికెట్లకు 62 పరుగులే చేసింది. లక్ష్యంలో సగం స్కోరైనా చేయలేదు. ఈ దశలో నజీబుల్లా (17 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇబ్రహీమ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు చేసి గెలిపించాడు.
చదవండి: Ravindra Jadeja: 'సాంపుల్ మాత్రమే.. అంతకంటే ఘోరమైనవి చాలానే చూశా'
AFG Vs BAN: అఫ్గన్‌తో మ్యాచ్.. అరుదైన ఘనత అందుకోనున్న బంగ్లా కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment