దుబాయ్: ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2–3తో చైనా చేతిలో పోరాడి ఓడిపోయింది. భారత స్టార్స్ ప్రణయ్, పీవీ సింధు తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ప్లేయర్ల చేతిలో ఓడిపోవడం భారత్‌ను దెబ్బ తీసింది.
తొలి మ్యాచ్‌లో 9వ ర్యాంకర్ ప్రణయ్ 13–21, 15–21తో 121వ ర్యాంకర్ లె లాన్ జీ (చైనా) చేతిలో... రెండో మ్యాచ్‌లో 9వ ర్యాంకర్ పీవీ సింధు 9–21, 21–16, 18–21తో 101వ ర్యాంకర్ గావో ఫాంగ్ జీ (చైనా) చేతిలో ఓడిపోవడంతో భారత్ 0–2తో వెనుబడింది.
అయితే మూడో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–చిరాగ్ శెట్టి జోడీ 21–19, 21–19తో హి జి టింగ్–జౌ హావో డాంగ్ ద్వయంపై... నాలుగో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–18, 13–21, 21–19తో లియు షెంగ్ షు–తాన్ నింగ్ ద్వయంపై నెగ్గడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఇషాన్–తనీషా ద్వయం 17–21, 13–21తో జియాన్ జాంగ్ బాంగ్–వె యా జిన్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత్ కాంస్యంతో సంతృప్తి పడింది.
Comments
Please login to add a commentAdd a comment