ICC Cricket World Cup Warm-up Matches 2023 - Australia vs Netherlands: వన్డే వరల్డ్‌కప్-2023లో తమ తొలి వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరు సాధించింది. వర్షం కారణంగా 23 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కాగా ఐసీసీ ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా శనివారం ఆసీస్- నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి.
కేరళలోని తిరువనంతపురంలో గల గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌కు వరణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో డచ్ బౌలర్ వాన్ బీక్ ఆరంభంలోనే కంగారూలకు షాకిచ్చాడు. స్టీవ్ స్మిత్‌తో పాటు ఓపెనింగ్‌కు వచ్చిన జోష్ ఇంగ్లిస్‌ను డకౌట్ చేశాడు. అయితే, స్మిత్ పట్టుదలగా నిలబడి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాన్ డెర్ మెర్వె బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
ఇక నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్(5) పూర్తిగా నిరాశపరచగా.. కామెరాన్ గ్రీన్ 34, అలెక్స్ క్యారీ 28, మిచెల్ స్టార్క్ 24(నాటౌట్) పరుగులతో రాణించారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(1), మాథ్యూ షార్ట్(5) పూర్తిగా విఫలం కాగా.. లబుషేన్ 3 పరుగులతో అజేయంగా నిలిచాడు.
నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, వాన్ డెర్ మెర్వె, బాస్ డీ లీడే రెండేసి వికెట్లు పడగొట్టగా.. షారిజ్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఆస్ట్రేలియా విధించిన 167 పరుగుల లక్ష్యంతో డచ్ జట్టు తదుపరి బ్యాటింగ్‌కు దిగనుంది.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ టీమ్:
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), మార్కస్ స్టొయినిస్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, సీన్ అబాట్.
నెదర్లాండ్స్ ప్లేయింగ్ టీమ్:
విక్రమ్ జిత్ సింగ్, మ్యాక్స్ ఓడోడ్, వెస్లీ బారెసి, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), షరీజ్ అహ్మద్, ఆర్యన్ దత్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వె, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, లోగాన్ వాన్ బీక్, ర్యాన్ క్లీన్, సిబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్, కొలిన్ అకెర్మాన్, సాకిబ్ జుల్ఫికర్, బాస్ డీ లీడే.
Comments
Please login to add a commentAdd a comment