ఆస్ట్రేలియాతో తొలి టెస్టు సందర్భంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం విఫలమయ్యాడు. స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో పాక్ ఘోర ఓటమి నేపథ్యంలో బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.
మూడు ఫార్మాట్లలోనూ పాక్ సారథిగా వైదొలిగాడు. అతడి స్థానంలో టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్.. టీ20 నాయకుడిగా షాహిన్ ఆఫ్రిది బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో కెప్టెన్ మార్పు అనంతరం పాకిస్తాన్ జట్టు తొలిసారిగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.
మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో తొలి మ్యాచ్ ఆడుతోంది. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 113.2 ఓవర్లలో 487 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 346/5తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 141 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్ (90; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీని చేజార్చుకున్నాడు.
ఇక తొలి టెస్టు ఆడుతున్న పాక్ బౌలర్ ఆమెర్ జమాల్ 111 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (42; 6 ఫోర్లు), కెప్టెన్ షాన్ మసూద్ (30; 5 ఫోర్లు) అవుటయ్యారు.
ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బాబర్ ఆజం.. 54 బంతులు ఎదుర్కొని 21 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ తీరుపై మరోసారి విమర్శలు వస్తున్నాయి. ఆసీస్- పాక్ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న పాక్ దిగ్గజ పేసర్ వసీం అక్రం సైతం బాబర్ ప్రదర్శన పట్ల పెదవి విరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. మిగతా పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ 28, అఘా సల్మాన్ 28 పరుగుల(నాటౌట్)తో పర్వాలేదనిపించారు. దీంతో 271 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.
ఇక మూడో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 34, స్టీవ్ స్మిత్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన డేవిడ్ వార్నర్ ఈసారి డకౌట్ కాగా.. మార్నస్ లబుషేన్(2) మరోసారి నిరాశపరిచాడు.
Comments
Please login to add a commentAdd a comment