26వ టెస్ట్‌ శతకం.. డేవిడ్‌ వార్నర్‌ ఖాతాలో పలు రికార్డు | AUS Vs PAK 1st Test Day 1: David Warner Registered His 26th Test Century, Bags Few More Records Check Inside - Sakshi
Sakshi News home page

AUS VS PAK 1st Test Day 1: 26వ టెస్ట్‌ శతకం.. డేవిడ్‌ వార్నర్‌ ఖాతాలో పలు రికార్డు

Published Thu, Dec 14 2023 6:49 PM | Last Updated on Thu, Dec 14 2023 8:00 PM

AUS VS PAK 1st Test Day 1: David Warner With His 26th Test Hundreds Bags Few Records - Sakshi

మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (డిసెంబర్‌ 14) మొదలైన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. డేవిడ్‌ వార్నర్‌ 26వ టెస్ట్‌ శతకంతో (211 బంతుల్లో 164; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది.

వార్నర్‌ శతకానికి ఉస్మాన్‌ ఖ్వాజా (41), స్టీవ్‌ స్మిత్‌ (31), ట్రవిస్‌ హెడ్‌ (40) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు తోడవ్వడంతో ఆసీస్‌ తొలి రోజే భారీ స్కోర్‌ చేసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లబూషేన్‌ (16) ఒ‍క్కడే కాస్త నిరాశపరిచాడు. ఆట ముగిసే సమయానికి మిచెల్‌ మార్ష్‌ (15), అలెక్స్‌ క్యారీ (14) క్రీజ్‌లో ఉన్నారు. పాక్‌ బౌలర్లలో ఆమిర్‌ జమాల్‌ 2 వికెట్లు పడగొట్టగా.. షాహీన్‌ అఫ్రిది, ఖుర్రమ్‌ షెహజాద్‌, ఫహీప్‌ అష్రాఫ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

రికార్డు శతకం..
తన కెరీర్‌లో చివరి టెస్ట్‌ సిరీస్‌ ఆడుతున్నట్లు ఇదివరకే ప్రకటించిన వార్నర్‌.. తన కెరీర్‌ చరమాంకంలో రికార్డు శతకంతో మెరిశాడు. ఈ ఇన్నింగ్స్‌ ఆరంభంలో టీ20 తరహాలో చెలరేగిన వార్నీ.. ఆతర్వాత కాస్త నెమ్మిదించి డబుల్‌ సెంచరీ దిశగా సాగాడు. అయితే దురదృష్టవశాత్తు అతను ఆమిర్‌ జమాల్‌ బౌలింగ్‌లో ఇమామ్‌ ఉల్‌ హాక్‌కు క్యాచ్‌ ఇచ్చి 164 పరుగుల వద్ద ఔటయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో వార్నర్‌ డబుల్‌ సెంచరీ మిస్‌ అయినప్పటికీ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (49) చేసిన ఓపెనర్‌గా.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో విరాట్‌ కోహ్లి (80) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా.. ఆసీస్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. వార్నర్‌ స్వదేశంలో పాకి​స్తాన్‌తో ఆడిన గత 14 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా ఏడు సెంచరీలు చేసి సొంతగడ్డపై పాకిస్తాన్‌ పాలిట ఎంతటి ప్రమాదకారో నిరూపించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్లు..

  • డేవిడ్‌ వార్నర్‌ (49)
  • సచిన్‌ టెండూల్కర్‌ (45)
  • క్రిస్‌ గేల్‌ (42)
  • సనత్‌ జయసూర్య (41)
  • మాథ్యూ హేడెన్‌ (40)
  • రోహిత్‌ శర్మ (40)

ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..

  • విరాట్‌ కోహ్లి (574 ఇన్నింగ్స్‌ల్లో 80 సెంచరీలు)
  • డేవిడ్‌ వార్నర్‌ (458 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు)
  • జో రూట్‌ (437 ఇన్నింగ్స్‌ల్లో 46)
  • రోహిత్‌ శర్మ (482 ఇన్నింగ్స్‌ల్లో 45)
  • స్టీవ్‌ స్మిత్‌ (374 ఇన్నింగ్స్‌ల్లో 44)
  • కేన్‌ విలియమ్సన్‌ (410 ఇన్నింగ్స్‌ల్లో 42)
  • బాబర్‌ ఆజమ్‌ (300 ఇన్నింగ్స్‌ల్లో 31)

ఆసీస్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..

  • రికీ పాంటింగ్‌ 13378
  • అలెన్‌ బోర్డర్‌ 11174
  • స్టీవ్‌ వా 10927
  • స్టీవ్‌ స్మిత్‌ 9351
  • డేవిడ్‌ వార్నర్‌ 8651
  • మైఖేల్‌ క్లార్క్‌ 8643

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement