స్పెన్సర్ జాన్సన్ (PC: BBL/CA)
Australia vs West Indies T20 Series 2024: వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా తదుపరి టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఇరుజట్ల మధ్య హోబర్ట్ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 9) నుంచి ఈ పొట్టి ఫార్మాట్ సిరీస్ ఆరంభం కానుంది.
ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది. పేసర్ నాథన్ ఎల్లిస్ స్థానాన్ని సెన్సర్ జాన్సన్‌తో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్ భాగం కానున్నాడని బుధవారం వెల్లడించింది.
నాథన్ ఎల్లిస్‌ను తప్పించారు
కాగా బిగ్ బాష్ లీగ్ 2023-24లో హోబర్ట్ హారికేన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన నాథన్ ఎల్లిస్ మెల్‌బోర్న్ స్టార్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పి కారణంగా గత కొంతకాలంగా అతడు ఆటకు దూరంగా ఉన్నాడు.
అయితే, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నాటికి ఎల్లిస్ కోలుకుంటాడని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి ప్రధాన జట్టులో చోటిచ్చింది. కానీ.. గాయం తీవ్రత దృష్ట్యా అతడికి మరికొంత కాలం విశ్రాంతి అవసరమని భావించి తాజాగా జట్టు నుంచి తప్పించింది.
ఈ క్రమంలో స్పెన్సర్ జాన్సన్.. సొంతగడ్డపై విండీస్‌తో సిరీస్ సందర్భంగా జట్టులో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ముంగిట నిలిచాడు. కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్(టీ20)లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.
బీబీఎల్-2024లో సంచలన ప్రదర్శనతో
ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున ఒక వన్డే, రెండు టీ20లు ఆడిన స్పెన్సర్ పొట్టి ఫార్మాట్లో కేవలం రెండు వికెట్లు తీశాడు. వన్డేల్లో ఇంకా ఖాతా తెరవనేలేదు. అయితే, బీబీఎల్ తాజా సీజన్‌లో మాత్రం దుమ్ములేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
బ్రిస్బేన్ హీట్‌కు ఆడిన స్పెన్సర్ జాన్సన్.. ఆ జట్టు టైటిల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బ్రిస్బేన్ తరఫున 11 మ్యాచ్‌లలో 19 వికెట్లు కూల్చి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
ఈ టీ20 లీగ్‌లో సిడ్నీ సిక్సర్‌తో జరిగిన ఫైనల్లో 4-0-26-4 గణాంకాలతో మెరిసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సంచలన బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ను విండీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక ఈ సిరీస్‌లో గనుక రాణిస్తే టీ20 వరల్డ్‌కప్-2024 రేసులో స్పెన్సర్ ముందుకు దూసుకురావడం ఖాయం.
ఆస్ట్రేలియా టీ20 జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.
వెస్టిండీస్ టీ20 జట్టు
రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయీ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేశ్ మోటి, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్.
చదవండి: పక్షిలా.. గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో సంచలన క్యాచ్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment