అడిలైడ్ : హమ్మయ్య.. మరో వికెట్ పడకుండా టీమిండియా కాచుకుంది. ఆరు వికెట్ల నష్టంతో తొలిరోజు ఆటను ముగించింది. జోరు మీదున్న ఆస్ట్రేలియా బౌలర్లు టీమిండియా బ్యాట్స్‌మన్లను వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టించడంతో ఒక దశలో ఆందోళన రేగింది. వృద్ధిమాన్ సాహా(9), రవిచంద్రన్ అశ్విన్(15) నాటౌట్‌గా నిలిచి తొలిరోజు ఆలౌట్ కాకుండా అడ్డుపడ్డారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.
Critical moment in the series? pic.twitter.com/fhuvIzfBSC
— ICC (@ICC) December 17, 2020
విహారి విఫలం
కెప్టెన్ విరాట్ కోహ్లి ఔటయిన తర్వాత టీమిండియా వేగంగా వికెట్లు కోల్పోయింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కోహ్లి(74) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. కుదురుగా ఆడుతున్న అజింక్య రహానే (42) కూడా వెంటనే అవుటయ్యాడు. టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారి కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. 16 పరుగులు చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్ల జోరు చూస్తే టీమిండియాను మొదటి రోజే ఆలౌట్ చేసేలా కనిపించారు. కానీ సాహా, అశ్విన్ మొండిగా నిలబడి కాపు కాశారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. హాజిల్‌వుడ్, కమిన్స్, లయన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
పృథ్విషా డకౌట్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆటగాడు పృథ్విషా రెండు బంతులను మాత్రమే ఎదుర్కొని స్టార్క్ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. మయాంక్ అగర్వాల్(17) కూడా నిరాశపరచడంతో ఇన్నింగ్స్‌కు మరమతు చేసే బాధ్యత పుజారా, కోహ్లి తీసుకున్నారు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరును వంద పరుగులకు చేర్చారు. జట్టు స్కోరు 100 పరుగుల వద్ద పుజారా(43) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. తర్వాత రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ను కోహ్లి చక్కదిద్దాడు. జట్టు స్కోరు 188 పరుగుల వద్ద కోహ్లి రనౌట్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. రహానే, విహారి వెంట వెంటనే ఔటవడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా బౌలర్లే పైచేయి సాధించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండో రోజు ఆటలో ఆసీస్ బౌలర్లను భారత్ బ్యాట్స్‌మన్ ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి. (చదవండి : పృథ్వీ షా డకౌట్.. వైరలవుతున్న ట్వీట్స్)
Comments
Please login to add a commentAdd a comment