వన్డే ప్రపంచకప్ 2023లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా. తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. 5 సార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఆసీస్ జట్టు.. పసికూన కంటే దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ అంటే వార్ వన్ సైడే అని భావించేవారు.
కానీ ఇప్పడు పరిస్థితి మరోలా ఉంది. భారత్ చేతిలో తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైన కంగారులు.. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఘోర పరభావం మూటకట్టుకుంది. సఫారీల దెబ్బకు ఆసీస్ జట్టు విలావిల్లాడింది.
ఏకంగా 134 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 311 పరుగుల భారీ లక్ష్య చేధనలో కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. వరల్డ్‌కప్ అంటే చెలరేగిపోయే ఆసీస్ ఎందుకు ఈ స్ధాయికి దిగజారింది? కంగారులు ఎక్కడ తప్పుచేస్తున్నారు? తర్వాత మ్యాచ్‌ల్లో కమ్మిన్స్ సేన తిరిగి పుంజుకుంటుందా వంటి విషయాలను ఓసారి చర్చిద్దాం.
ఓపెనర్లు విఫలం..
ఆస్ట్రేలియాకు బౌలింగ్ ఎంత బలమో.. బ్యాటింగ్ కూడా అంతే బలం. 300 పరుగుల టార్గెట్ కూడా ఆసీస్ బ్యాటింగ్ జోరు ముందు చిన్నబోయేది. అటువంటి ఆస్ట్రేలియా ఈ వరల్డ్‌కప్‌లో 200 పరుగుల మార్క్‌ను అందుకోవడానికి కూడా నానా కష్టాలు పడుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఓపెనర్లు విఫలం. ఈ మెగా టోర్నీకి ఆసీస్ రెగ్యూలర్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ గాయం కారణంగా దూరమయ్యాడు. హెడ్ లేని లోటు ఆసీస్ జట్టులో స్పష్టంగా కన్పిస్తోంది.
హెడ్ గైర్హాజరీలో ఆసీస్ ఇన్నింగ్స్‌ను మిచెల్ మార్ష్.. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఆరంభిస్తున్నాడు. ఓపెనర్‌గా వస్తున్న మార్ష్ కనీసం ఒకట్రెండు ఓవర్లు కూడా క్రీజులో ఉండలేకపోతున్నాడు. భారత్‌తో మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన మార్ష్.. ప్రోటీస్‌పై కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కాస్త పర్వాలేదనపిస్తున్నాడు. టీమిండియాపై 41 పరుగులతో రాణించిన వార్నర్.. దక్షిణాఫ్రికాపై మాత్రం 13 పరుగులకే తమ ఇన్నింగ్స్‌ను ముగించాడు. అయితే ఇది వార్నర్ నుంచి ఆశించిన ప్రదర్శన కాదు. తర్వాతి మ్యాచ్‌లో ఆసీస్ తిరిగి గాడిలో పడాలంటే ఓపెనింగ్ జోడిని మార్చాలిందే.
మరో వికెట్ కీపర్ లేడా?
ప్రస్తుత ఆస్ట్రేలియాతో జట్టులో సమర్థవంతమైన వికెట్ కీపర్ బ్యాటర్ లేడు. ఒకప్పుడు ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఇయాన్ హీలీ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఆసీస్.. ఇప్పుడు ఆ స్ధాయి కీపర్లను తయారుచేయలేకపోతుంది. వికెట్ కీపర్ అంటే.. వికెట్ల వెనుక మెరుగ్గా రాణిస్తే చాలు అన్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పరిస్థితి ఉంది. ప్రస్తతం ఆసీస్ జట్టులో రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా అలెక్స్ కారీ కొనసాగుతున్నాడు.
వికెట్లు వెనుక పర్వాలేదనపిస్తున్న కారీ.. బ్యాటింగ్ పరంగా తీవ్ర నిరాశపరిస్తున్నాడు. జట్టుకు కీలకమైన మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న అతడు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమవుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే కారీ పెవిలియన్‌కు చేరాడు.
దీంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు క్యారీ ఆసీస్ జట్టు మేనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. అతడి స్ధానంలో జోష్ ఇంగ్లీష్ జట్టులోకి వచ్చాడు. జోష్ ఇంగ్లీష్ కూడా అదే తీరును కనబరిచాడు. 5 పరుగులకే తన ఇన్నింగ్స్‌ను జోష్ ముగించాడు. కచ్చితంగా వీరిద్దరి ప్రత్యామ్నాయం వెతకాల్సిన సమయం క్రికెట్ ఆస్ట్రేలియాకు అసన్నమైంది.
ఫినిషింగ్ లేదు..
ఆస్ట్రేలియా అంటే విధ్వంసకర ఆటకు మారుపేరు. అటువంటిది ప్రస్తుత మెగా టోర్నీలో ఆసీస్ ఆటగాళ్ల బ్యాట్‌లు మూగబోయాయి. సిక్స్‌లు మాట పక్కన పెడితే ఫోర్లు కూడా కొట్టడానికి కష్టపడుతున్నారు. టాపర్డర్‌లో వార్నర్.. మిడిలార్డర్‌లో స్మిత్, లాబుషేన్ కొన్ని మంచి ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ ఆసీస్‌కు ఫినిషింగ్ మాత్రం దొరకడంలేదు. వరల్డ్ క్రికెట్‌లో విధ్వంసకర ఆటగాళ్లగా పేరు గాంచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, గ్రీన్, స్టోయినిష్ తుస్సుమనిపిస్తున్నారు.
తొలి మ్యాచ్‌లో గ్రీన్, మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సఫారీలతో మ్యాచ్‌కు గ్రీన్ స్ధానంలో స్టోయినిష్‌కు అవకాశం ఇచ్చారు. స్టోయినిష్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్‌ది కూడా అదే పరిస్ధితి. బౌలింగ్‌లో పర్వాలదేనపిస్తున్న మ్యాక్సీ.. బ్యాటింగ్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ హిట్టర్లు తిరిగి గాడిలో పడకపోతే ఈ మెగా టోర్నీలో ఆసీస్ ఇంటిముఖం పట్టకతప్పదు.
జంపా ఫెయిల్..
ఆసీస్ బౌలింగ్ పరంగా కాస్త పర్వాలేదనపిస్తుంది. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి కష్టాలోక్కి నెట్టారు. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు తమ రిథమ్‌ను కోల్పోవడంతో టీమిండియా విజేతగా నిలిచింది. హాజిల్‌వుడ్, స్టార్క్, కమ్మిన్స్ వంటి తమ స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేస్తున్నారు. కానీ కంగారుల ఫ్రంట్ లైన్ స్పిన్నర్ ఆడమ్ జంపా మాత్రం తీవ్ర నిరాశపరిస్తున్నాడు. వికెట్లు తీయడంలో విఫలమవుతున్న జంపా.. పరుగులు భారీగా సమర్పించుకుంటున్నాడు.
చెత్త ఫీల్డింగ్..
ఆస్ట్రేలియా క్రికెటర్లు మైదానంలో చాలా చురుగ్గా ఉంటారు. ఎన్నో అద్బుత క్యాచ్‌లను అందుకోవడం మనం చూశాం. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఫీల్డింగ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచింది. 4 ఈజీ క్యాచ్‌లను ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రాప్ చేశారు. అంతేకాకుండా మిస్ ఫీల్డ్‌లు కూడా చాలా చేశారు.
శ్రీలంకతో..
ఆసీస్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 16న శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి మూడు విభాగాల్లో తిరిగిపుంజుకోవాలి. అయితే శ్రీలంక బ్యాటింగ్ పరంగా దుమ్మురేపుతోంది.కాబట్టి శ్రీలంకనుంచి కూడా ఆసీస్‌కు గట్టిపోటి ఎదునుకానుంది.
చదవండి: WC 2023: దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి.. 48 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment