
ఉత్కంఠపోరులో బంగ్లాదేశ్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపు
అర్ధ సెంచరీలతో ఆదుకున్న ట్రయాన్, కాప్
హడలెత్తించిన బంగ్లాదేశ్ బౌలర్లు
సాక్షి, విశాఖపట్నం: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా కష్టపడి గెలిచింది. లక్ష్యఛేదనలో 78 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న సఫారీ జట్టును మరిజన్ కాప్ (71 బంతుల్లో 56; 4 ఫోర్లు, 1 సిక్స్)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లో ట్రయాన్ (69 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటంతో గట్టెక్కించారు. దీంతో దక్షిణాఫ్రికా ఆఖరి ఓవర్‌దాకా పోరాడి 3 బంతులు మిగిలి ఉండగా 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది.
సఫారీకిది వరుసగా మూడో విజయం కాగా... బంగ్లాదేశ్‌కు మూడో పరాజయం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫర్జానా హక్ (30; 3 ఫోర్లు), రుబియా హైదర్ (25) తొలి వికెట్‌కు 53 పరుగులతో చక్కని ఆరంభాన్నిచ్చారు. వీళ్లిద్దరు అవుటయ్యాక... టాపార్డర్ బ్యాటర్ షర్మిన్ అక్తర్ (77 బంతుల్లో 50; 6 ఫోర్లు), కెపె్టన్ నిగార్ సుల్తానా (42 బంతుల్లో 32; 5 ఫోర్లు) కుదురుగా ఆడి మరో పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. షర్మిన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆఖర్లో షోర్న అక్తర్ (35 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడింది. రీతూ మోనీ (8 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి వేగంగా పరుగులు జతచేసింది. సఫారీ బౌలర్లలో ఎంలాబా 2 వికెట్లు, డి క్లెర్క్, ట్రయాన్ చెరో వికెట్ తీశారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి గెలిచింది.
ఆరంభంలోనే బ్రిట్స్ (0) వికెట్ కోల్పోగా... లారా వోల్‌వార్ట్ (56 బంతుల్లో 31; 5 ఫోర్లు), అనికె బాష్ (35 బంతుల్లో 28; 6 ఫోర్లు) జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. అయితే 20 పరుగుల వ్యవధిలో క్రీజులో పాతుకుపోయిన వీరిద్దరితో పాటు డెర్క్‌సెన్ (2), సినాలో జాఫ్టా (4) నిష్క్రమించారు. దీంతో 78/5 స్కోరు వద్ద సఫారీకి పరాజయం తప్పదనిపించింది. ఈ దశలో మరిజన్ కాప్, ట్రయాన్ ఆరో వికెట్‌కు 85 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా గెలుపు ట్రాక్‌లో పడింది.
ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తయ్యాక అవుటయ్యారు. అయితే డిక్లెర్క్ (29 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసింది. భారత్ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసినట్లే కీలకమైన పరుగులతో బంగ్లాదేశ్‌తోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇంకో 3 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో నహిదా అక్తర్ 2, రబియా ఖాన్, ఫాహిమా, రీతు మోని తలా ఒక వికెట్ తీసి సఫారీని ఇబ్బంది పెట్టారు. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడుతుంది.