న్యూఢిల్లీ: ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటంతో వివిధ ఫ్రాంచైజీలలో భాగంగా ఉన్న విదేశీ క్రికెటర్లు బయో బబుల్‌ను వదిలి తమ దేశాలకు బయలుదేరారు. పలువురు ఆటగాళ్లు ఇప్పటికే స్వస్థలాలకు చేరుకోగా... మరికొందరు ఆయా దేశాల ఆంక్షలు, నిబంధనల ప్రకారం తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారత క్రికెటర్లు దాదాపు అంతా తమ సొంత నగరాలకు వెళ్లిపోయారు. కరోనా సోకిన ఆటగాళ్లు ఉన్న టీమ్‌లలో కూడా మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌గా తేలితే ఫ్రాంచైజీలు పంపించేందుకు సిద్ధమయ్యాయి. విదేశీ క్రికెటర్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మినహా మిగతా దేశాలకు చెందిన క్రికెటర్లు ఎలాంటి సమస్య లేకుండా వెళ్లిపోతున్నారు.
న్యూజిలాండ్: ఐపీఎల్‌లో ఉన్న 17 మంది న్యూజిలాండ్ ఆటగాళ్లు రెండు బృందాలుగా విడిపోయారు. ఇందులో ఒక బృందం స్వదేశానికి వెళ్లనుండగా, మిగిలిన ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు వెళతారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్, ఆపై భారత్‌తో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో, ఇంగ్లండ్ టి20 బ్లాస్ట్‌లో పాల్గొనేందుకు కివీస్ ఆటగాళ్లు విలియమ్సన్, బౌల్ట్, జేమీసన్, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, నీషమ్, ఫిన్ అలెన్ ఇంగ్లండ్ వెళతారు. అయితే వీరంతా మే 10 వరకు భారత్‌లోనే ఉండనున్నారు. ఆపై ఇంగ్లండ్ ప్రభుత్వం సడలించే ఆంక్షలను బట్టి బయల్దేరతారు. ఫ్లెమింగ్, మెకల్లమ్, మిల్స్, షేన్ బాండ్ తదితరులు న్యూజిలాండ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరికి ప్రభుత్వ పరంగా సమస్య లేదు కానీ ప్రయాణించేందుకు విమానాలు మాత్రం లేవు. ఐపీఎల్‌లో ఒకటి, రెండు ఫ్రాంచైజీలు కలిసి వీరి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
ఇంగ్లండ్: ఐపీఎల్‌లో భాగంగా ఉన్న 11 మంది ఇంగ్లండ్ క్రికెటర్లలో ఎనిమిది మంది లండన్‌కు చేరుకున్నారు. బట్లర్, మొయిన్ అలీ, స్యామ్ కరన్, టామ్ కరన్, వోక్స్, బెయిర్‌స్టో, జేసన్ రాయ్, స్యామ్ బిల్లింగ్స్ బుధవారం ఉదయమే హీత్రూ విమానాశ్రయానికి వచ్చారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. మరో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు మోర్గాన్, జోర్డాన్, మలాన్ రెండు రోజులు ఆలస్యంగా బయలుదేరుతారు. వీరంతా అక్కడి నిబంధనల ప్రకారం పది రోజుల పాటు ప్రభుత్వ అనుమతి పొందిన హోటల్‌లలో క్వారంటైన్‌లో ఉంటారు.
ఆస్ట్రేలియా: ఆసీస్ క్రికెటర్లు భారత్ వీడటంపై మాత్రం స్పష్టత వచ్చేసింది. నేరుగా తమ దేశంలోనికి అనుమతి లేదని తెలుసు కాబట్టి ప్రత్యామ్నాయంగా వీరంతా మాల్దీవులను ఎంచుకున్నారు. ఆటగాళ్ల కోసం ప్రత్యేక సడలింపులు ఏమీ లేవు కాబట్టి సుమారు 40 మంది ఆస్ట్రేలియన్లు రెండు వారాలు మాల్దీవులలో గడిపిన తర్వాతే స్వదేశానికి వెళతారు. బీసీసీఐ వీరి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ముందుగా మాల్దీవులకు, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లేందుకు కూడా బోర్డు బాధ్యత తీసుకుంటోంది. బుధవారం వీరంతా ఢిల్లీకి చేరుకొని ఒకటి, రెండు రోజుల్లో ఇక్కడి నుంచి బయలుదేరుతారు. కరోనా పాజిటివ్‌గా తేలిన మైక్ హస్సీ మాత్రం భారత్‌లోనే కనీసం పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు.
ఇంటికి చేరిన ఇంగ్లండ్ క్రికెటర్లు
Published Thu, May 6 2021 4:06 AM | Last Updated on Thu, May 6 2021 1:49 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment