
భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్‌లో అర్హత సాధించాడు. పోలాండ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్‌లో మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల అవినాశ్ 8 నిమిషాల 11.63 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (8ని:15.00 సెకన్లు) అవినాశ్ అధిగమించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో హీట్స్‌లోనే వెనుదిరిగిన అవినాశ్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో, 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలిచాడు.