Axar Patel: లంక వెన్నులో వణుకు పుట్టించాడు | Axar Patel Career Best Innings 31 Balls-65 Runs Vs SL 2nd T20 Match | Sakshi
Sakshi News home page

Axar Patel: లంక వెన్నులో వణుకు పుట్టించాడు

Published Thu, Jan 5 2023 11:30 PM | Last Updated on Thu, Jan 5 2023 11:32 PM

Axar Patel Career Best Innings 31 Balls-65 Runs Vs SL 2nd T20 Match - Sakshi

శ్రీలంకతో జరిగిన రెండో టి20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే టీమిండియా ఓడినా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ తన బ్యాటింగ్‌తో లంక వెన్నులో వణుకు పుట్టించాడు. ఆల్‌రౌండర్‌ అనే పదానికి సరైన నిర్వచనం చెబుతూ తన కెరీర్‌లోనే బెస్ట్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు అక్షర్‌ పటేల్‌. ఒక దశలో 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన టీమిండియాను సూర్యకుమార్‌తో కలిసి అక్షర్‌ ఇన్నింగ్స్‌ ఆడిన విధానం మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పొచ్చు.

కళ్లముందు భారీ లక్ష్యం కనిపిస్తున్నా సూర్యకుమార్‌ అండతో అక్షర్‌ పటేల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు రనౌట్‌ నుంచి తప్పించుకున్న అక్షర్‌ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. మొదట తీక్షణ వేసిన ఇ‍న్నింగ్స్‌ 13వ ఓవర్లో సిక్స్‌, ఫోర్‌ సహా 12 పరుగులు రాబట్టిన అక్షర్‌ పటేల్‌ ఆ తర్వాత 14వ ఓవర్‌ వేసిన హసరంగాకు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో అక్షర్‌ పటేల్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదగా.. సూర్య మరో సిక్సర్‌తో చెలరేగడంతో మొత్తంగా 26 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే కరుణరత్నే బౌలింగ్‌లో మరో సిక్సర్‌ బాదిన అక్షర్‌ పటేల్‌ 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 

టీమిండియా తరపున ఏడో నెంబర్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు చేసిన  బ్యాటర్‌గా అక్షర్‌ పటేల్‌ రికార్డు సృష్టించాడు. ఇంతవరకు జడేజా పేరిట ఆ రికార్డు ఉంది. 2020లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో జడేజా 23 బంతుల్లో 44 నాటౌట్‌ ఇప్పటివరకు రికార్డుగా ఉంది. తాజాగా అక్షర్‌ పటేల్‌ దానిని బద్దలుకొట్టాడు. దీంతో పాటు మరో రికార్డు కూడా అక్షర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరపున ఒక టి20 మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అర్థసెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా అక్షర్‌ పటేల్‌ రికార్డులకెక్కాడు.

మొత్తానికి జడేజా లేని లోటును తీరుస్తున్న అక్షర్‌పటేల్‌ అంతకముందు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఒకవేళ​ ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి ఉంటే మాత్రం అక్షర్‌ పటేల్‌ పేరు మారుమోగిపోయేది. ఇప్పుడు కూడా అక్షర్‌ పటేల్‌ ఇన్నింగ్స్‌ను తీసిపారేయాల్సిన అవసరం లేదు. బహుశా ఈ ఇన్నింగ్స్‌ అతనికి మరో 10 మ్యాచ్‌ల వరకు జట్టు నుంచి పక్కనబెట్టకుండా చేసిందని చెప్పొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement